విషవాయువు పీల్చడం వల్లే నటుడి మృతి
కారులో శవమై కనిపించిన సినీ నటుడు వినోద్ థామస్ మృతికి విషవాయువు పీల్చడమే కారణమని నిర్ధారణ అయింది.
కారులో శవమై కనిపించిన సినీ నటుడు వినోద్ థామస్ మృతికి విషవాయువు పీల్చడమే కారణమని నిర్ధారణ అయింది. మరణానికి కార్బన్ మోనాక్సైడ్ కారణమని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. శనివారం సాయంత్రం పంపాడి కలచంటలోని ప్రైవేట్ బార్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో వినోద్ ఒక కార్ లో విగత జీవిగా కనిపించాడు. మీనాదం కురియనూర్‌కు చెందిన తంకచన్-కుంజమ్మ దంపతుల కుమారుడు వినోద్ థామస్ (47) మృతదేహం కారులో కనిపించింది. మరణానికి కార్బన్ మోనాక్సైడ్ పీల్చడమే కారణమని ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
పంపాడి పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరుసటి రోజు మోటారు వాహన శాఖ కారును తనిఖీ చేస్తుంది. ఆ తర్వాత పోలీసులు విచారణను విస్తృతం చేయనున్నారు. శనివారం బార్ పరిసరాల్లో పార్క్ చేసిన వినోద్ తన సొంత కారులో ఎక్కి చాలా సేపటికి బయటకు రాకపోవడంతో బార్ సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పంపాడి ఎస్‌హెచ్‌ఓ సువర్ణకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతుడి సమాచారం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వినోద్ పలు విజయవంతమైన సినిమాల్లో నటించాడు. ఇటీవల అయ్యప్పనుమ్ కోషియం లాంటి భారీ బ్లాక్ బస్టర్ లోను అతడు కీలక పాత్రను పోషించాడు 16 సినిమాలు, 20 షార్ట్ ఫిల్మ్‌లు, డ్రామాలు, సీరియల్స్‌లో నటించాడు. అతడు ఒంటరివాడని తెలిసింది.