సలార్ (Vs) డుంకి: అమెరికాలో ప్రభాస్ ఆధిపత్యం!
అసలే వరుస విజయాలతో మాంచి దూకుడుమీదున్న షారూఖ్ ఖాన్ హ్యాట్రిక్ కసితో దూసుకొస్తుంటే, అతడిని నిలువరించేందుకు మాస్ ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు.
సలార్ వర్సెస్ డుంకీ! ప్రస్తుతం ఇండస్ట్రీ ట్రేడ్ లో హాట్ టాపిక్ ఇది. ప్రభాస్ నేరుగా ఖాన్ నే ఢీకొడుతున్నాడు. అసలే వరుస విజయాలతో మాంచి దూకుడుమీదున్న షారూఖ్ ఖాన్ హ్యాట్రిక్ కసితో దూసుకొస్తుంటే, అతడిని నిలువరించేందుకు మాస్ ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. వార్ ఆఫ్ యారోస్ కి తెరలేచింది. అయితే రెండు భారీ సినిమాల మధ్య భీకర ఫైట్ అంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లో కూడా విస్తృత ప్రయత్నాలు జరుగుతాయి. హోంబలే ఫిల్మ్స్ USలో రికార్డు స్థాయిలో లొకేషన్లను బుక్ చేసి ఖాన్ కి బిగ్ పంచ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
22 డిసెంబర్ 2023న ప్రభాస్ 'సలార్' విడుదల కాబోతోందని హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రకటనతో పాటే హోంబలే ప్లానింగ్ లో దూసుకుపోతోంది. షారూఖ్ ఖాన్ డుంకీతో సలార్ పోటీపడుతోందన్న వార్త అన్ని పరిశ్రమల్లో సంచలనమైంది. ఈ వార్ రెండు సినిమాలకు మేలు చేయదని ట్రేడ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీతనం నిండిన సలార్ - డుంకీ రెండూ చాలా రికార్డుల్ని బ్రేక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే హోంబలే ఫిలింస్ మాత్రం ఆ తేదీని మాత్రమే కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ VFX పనితనంపై సంతృప్తిగా లేనందున సలార్ తొలుత ప్రకటించిన తేదీ నుంచి వాయిదా పడింది. టెక్నికల్‌గా చక్కటి చిత్రంగా తన స్థాయికి సరిపోయే చిత్రాన్ని అందించడానికి దర్శకుడే పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎక్కువ సమయం కోరుకున్నాడు. ప్రభాస్ అభిమానులు అతనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారని ప్రశాంత్ నీల్‌కు కూడా తెలుసు. అందుకే ఈ జాగ్రత్తలు. అన్నివిధాలా సిద్ధం చేసి సలార్ ని వదలాలనేది అతడి ప్లాన్. ఈ విషయంలో రాజీకొచ్చే ప్రసక్తే లేదు.
అయితే సలార్ రాకతో ఇప్పుడు షారూఖ్ ఖాన్ డుంకీ ఉత్తరాదితో పాటు, ఉత్తర అమెరికాలోను విపరీతమైన పోటీని ఎదుర్కొంటుంది. తాజా సమాచారం మేరకు..ప్రభాస్ సలార్ యూఎస్‌లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఉత్తర అమెరికా అంతటా 1979 లొకేషన్లలో ఈ చిత్రం లాక్ అయింది. బాహుబలి స్టార్ కి బలమైన మార్కెట్లలో అమెరికా ఒకటి. 28 సెప్టెంబరు 2023న విడుదల ప్రకటించిన అనంతరం ఆయా లొకేషన్లలో అద్భుతమైన ప్రీ-సేల్స్ చేసారు. కానీ రిలీజ్ వాయిదా పడడంతో టికెట్ ధరల్ని వెనక్కి చెల్లించారు. ఇప్పుడు కూడా డుంకీకి భారీ ఫైట్‌ని అందించే అవకాశం వారికి ఉంది. అలాగని అటువైపు కింగ్ ఖాన్ ని తక్కువ అంచనా వేయలేం. అలాగే రాజ్‌కుమార్ హిరాణీ చిత్రాలను ప్రపంచ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో డుంకీ పంపిణీలో వైఆర్‌ఎఫ్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వారు జవాన్ ని పెద్ద హిట్ చేయడంలో పెద్ద సక్సెసయ్యారు. ఇప్పుడు డుంకీతో మరో బ్లాక్ బస్టర్ ని ఖాన్ కి అందించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇరు సినిమాల నడుమా వార్ లో పైచేయి సాధించాలంటే ఏం చేయాలి? అన్నదే ప్రశ్న. ఈ విషయంలో హోంబలే ఒకడుగు ముందుకు వేసి డుంకీకి ఊహించని ఝలక్ ఇచ్చింది. అయితే ఇతర మార్కెట్లలో ఎవరు ఏ విధమైన ప్లానింగ్ తో సాగుతున్నారు? ఎవరు ఎవరికి థియేటర్ల పరంగా ఝలకిస్తారన్నది ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్నాటక, కేరళలో సలార్ అత్యంత భారీగా విడుదల కానుంది. ఇప్పటికే ఆ మేరకు హోంబలే సంస్థ ఏర్పాట్లలో ఉంది. ప్రతిదీ ముందస్తు ప్రణాళికతో సాధించుకుంటోంది. ఇక ఉత్తరాదిన షారూఖ్ ప్రభావం అసాధారణంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అయినా అక్కడా సలార్ ని అత్యంత భారీగా రిలీజ్ చేయాలని హోంబలే ఇప్పటికే బిగ్ డిస్ట్రిబ్యూటర్లతో టై అప్ అయిందని తెలుస్తోంది.
షారూఖ్ ఖాన్ - ప్రభాస్ అభిమానుల ఆన్‌లైన్ వార్
హోంబలే ఫిల్మ్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మెజారిటీ SRK అభిమానులు కలత చెందారు. డుంకీ 21 డిసెంబర్ 2023న విదేశాల్లో విడుదలవుతుంది. సలార్ కంటే ఒకరోజు ముందుగానే వస్తోంది. అయితే సలార్ ఆ మరునాడే విడుదలవుతుంది కాబట్టి దాని ప్రభావం చాలా పెద్దది. డుంకీ టీమ్ ఏడాది ముందే రిలీజ్ డేట్ ప్రకటించింది. కానీ ఇప్పుడు సలార్ అనూహ్యంగా తెరపైకొచ్చింది. దీనివల్ల డుంకీ ఓపెనింగులకు సమస్య తప్పదు. షేరింగ్ వల్ల రికార్డులు సాధ్యపడవు. అలాగని ఖాన్ ఎక్కడా తగ్గేందుకు లేదు. ఇద్దరు సూపర్‌స్టార్‌ల అభిమానులు వారికి హిట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఆ మేరకు వార్ తప్పదు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో ప్రైమ్ థియేటర్ల కోసం ఇరువర్గాల నడుమా తీవ్రమైన పోటీ నెలకొంటుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. మునుముందు ఈ పోటీ తీవ్రతను తగ్గించేందుకు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో వేచి చూడాలి.