ప్రభాస్... బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకునేలా..
పాన్ ఇండియా కల్చర్ మొదలైన తర్వాత టైర్1, టైర్ 2 హీరోలు అందరూ కూడా దీనినే పట్టుకున్నారు
పాన్ ఇండియా కల్చర్ మొదలైన తర్వాత టైర్1, టైర్ 2 హీరోలు అందరూ కూడా దీనినే పట్టుకున్నారు. బాహుబలి సిరీస్ టాలీవుడ్ స్టార్స్ ని పాన్ ఇండియా వ్యామోహంలోకి నెట్టేసింది. కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి వినోదాన్ని అందించే స్టార్స్ కొత్త కథలపైనా శ్రద్ధ పెట్టడం మొదలు పెట్టారు. దీంతో ఏడాదికి రెండు సినిమాలు చేసే మన స్టార్ హీరోలు కనీసం ఒక్క మూవీ కూడా ఇప్పుడు తీసుకురావడం లేదు. ఒక్కో సినిమా కోసం రెండు, మూడేళ్ల సమయం తీసుకుంటున్నారు.
యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అలాగే సెలక్టివ్ గా స్టార్ దర్శకులతోనే మూవీస్ చేస్తున్నారు. ఈ కారణంగా స్టార్ హీరోల సినిమాలు చూడటమే గగనం అయిపోతుంది. ఇక టైర్ 2 హీరోల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. వీరు కూడా రీజనల్ కథల జోలికి వెళ్లడం లేదు. కచ్చితంగా అన్ని భాషలలో రిలీజ్ అయ్యేలా కంటెంట్ ఉండాలని కోరుకుంటున్నారు.
అందుకే దర్శకులు కూడా కొత్త కథలు సిద్ధం చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ పూర్తిగా బోసిపోతున్నాయి. ఒకప్పుడు ఏడాదిలో అందరి హీరోల సినిమాలు మేగ్జిమమ్ థియేటర్స్ లోకి వచ్చి కళకళలాడుతూ ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఏడాది చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్క మహేష్ బాబు గుంటూరు కారం తప్ప చెప్పుకోదగ్గ పెద్ద మూవీ రిలీజ్ కాలేదు.
అయితే డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు కచ్చితంగా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వరల్డ్ వైడ్ గా 22 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ అవుతోంది. గత ఏడాది ప్రభాస్ నుంచి ఆదిపురుష్, సలార్ మూవీస్ థియేటర్స్ లోకి వచ్చాయి.
ఈ ఏడాది టాలీవుడ్ నుంచి రాబోయే అతిపెద్ద సినిమా కల్కి 2898ఏడీ అందరికంటే ముందుగా రాబోతోంది. అన్ని కుదిరితే రాజా సాబ్ కూడా వచ్చేది. కానీ అది ఇంచుమించు మరో ఏడాది లోపే ప్రేక్షకుల ముందుకు రానుంది. లిస్ట్ లో ఉన్న హను రాఘవపూడి సినిమా తొందరగా స్టార్ట్ చేస్తే ఏడాది టైమ్ లోనే రావచ్చు. ఇక సందీప్ తో స్పిరిట్ మూవీ కూడా తొందరగానే ఫినిష్ కానుంది.
ప్రభాస్ సినిమాలు ఓ విధంగా టాలీవుడ్ కి ఊపిరి పోస్తున్నాయి. ఆడియన్స్ సినిమాలు చూడటానికి థియేటర్స్ కి రావడానికి కూడా పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో థియేటర్స్ యజమానులు ఆందోళనకి గురవుతున్నారు. అయితే డార్లింగ్ ప్రభాస్ మాత్రం వారికి తన సినిమాలతో కొంత ఊరట కలిగిస్తున్నాడు. డిస్టిబ్యూటర్స్ ని, థియేటర్స్ ఓనర్స్ కి కాస్త బ్రతికిస్తున్నాడనే మాట వినిపిస్తోంది.