ఆ కథపై రెండేళ్లు వర్క్ చేసి, నేనే డైరెక్ట్ చేయాలి అనుకున్నా : ప్రశాంత్ వర్మ
టాలీవుడ్‌లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న దర్శకుల పేర్ల జాబితాలో ప్రశాంత్ వర్మ పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.
టాలీవుడ్‌లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న దర్శకుల పేర్ల జాబితాలో ప్రశాంత్ వర్మ పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఆరంభంలో 'హనుమాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ వర్మకు వెంటనే బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల బాలీవుడ్ సినిమాను క్యాన్సల్ చేసుకుని వరుసగా టాలీవుడ్ సినిమాలను చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే జై హనుమాన్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. మరో వైపు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మొదటి సినిమాకు సంబంధించిన పనులు సైతం మొదలు పెట్టిన విషయం తెల్సిందే.
ఒక వైపు దర్శకుడిగా రెండు మూడు సినిమాలను ఒకేసారి చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో వైపు తన సమర్పణలో సినిమాలను తీసుకు వస్తున్నాడు. కథలు అందించడంతో పాటు, సినిమాల స్క్రీన్ ప్లే లు అందిస్తూ ఇతర దర్శకుల దర్శకత్వంలో తన బ్యానర్‌లో సినిమాలను నిర్మిస్తూ ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అలాంటిదే మరో సినిమా 'దేవకీ నందన వాసుదేవ'. ఈ సినిమాలో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించగా, మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో ప్రచారం జోరుగా చేస్తున్నారు.
దేవకీ నందన వాసుదేవ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించిన ప్రశాంత్ వర్మ ప్రమోషనల్‌లో భాగంగా ఒక చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఈ కథ పై నేను వర్క్ చేశాను. తప్పకుండా మంచి సినిమా అవుతుంది అనే ఉద్దేశ్యంతో నేనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని భావించాను. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకి దర్శకత్వం చేయలేక పోయాను. ఈ సినిమాలో అశోక్ ని అనుకున్నప్పుడు మరీ సాఫ్ట్‌గా ఉన్నాడు.. పనికి వస్తాడా అనుకున్నాం. కానీ లుక్ టెస్ట్ అయిన తర్వాత నమ్మకం కుదిరింది. ఒక షెడ్యూల్ పూర్తి అయ్యి, రష్ చూసిన తర్వాత కచ్చితంగా ఈ పాత్రకు అశోక్ మాత్రమే సెట్ అనిపించింది.
ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలతో దేవకీ నందన వాసుదేవ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అశోక్ గల్లా గతంలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను దక్కించుకోలేదు. కానీ ప్రశాంత్ వర్మ కథ కావడంతో పాటు, ఆయన ఈ సినిమా మేకింగ్‌లోనూ సలహాలు, సూచనలు చేయడంతో కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమా గురించిన ప్రచారం బాగానే ఉంది. మహేష్ బాబు లేదా మరెవ్వరైనా స్టార్ ఈ సినిమా ప్రమోషన్ కోసం వస్తే మరింత అంచనాలు, ఆసక్తి పెరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అశోక్ కి ఈ సినిమాతోనైనా సక్సెస్ దక్కేనా అంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.