అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటి? వాటి సంగతేంటి?
మరి అధీరా, ఆక్టోపస్ సినిమాలు సంగతేంటో? అన్ని చిత్రాలను ఒకేసారి లైనప్ లో చేర్చడం వెనుక అసలు ప్లాన్ ఏంటో? ప్రశాంత్ వర్మకే తెలియాలి.
'ఇండియాలో ఇద్దరు ప్రశాంత్ ల పేర్లే వినిపిస్తాయి.. అందులో ఒకటి ప్రశాంత్ నీల్.. మరొకటి ప్రశాంత్ వర్మ..' ఇవి యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ మూవీ ప్రమోషన్స్ లో చేసిన వ్యాఖ్యలు! ఏ ముహుర్తాన తేజ అలా అన్నారో గానీ.. హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత ప్రశాంత్ వర్మ పేరు వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో వినిపించింది. ఎక్కడ చూసినా ఆయన గురించే మాట్లాడుకున్నారు. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ క్వాలిటీతో హనుమాన్ తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అప్పటి వరకు క్రియేటివ్ సినిమాలనే తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ తో లైమ్ లైట్ లోకి వచ్చారు. వేరే లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. అందరి దృష్టి తన కొత్త సినిమాల వైపు తిప్పుకున్నారు. హనుమాన్ విడుదల తర్వాత తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా జై హనుమాన్ ను ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూను అనౌన్స్ చేశారు. వెంటనే మహాకాళి సూపర్ హీరోయిన్ మూవీ కూడా ప్రకటించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా ప్రశాంత్ వర్మ వర్క్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి కన్నా ముందు నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ తో అధీరాను ప్రకటించారు. షూట్ స్టార్ట్ చేసి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ ఆక్టోపస్ మూవీ కూడా ఆయన చేతిలో ఉంది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ మూవీస్ కోసం చర్చ జరుగుతోంది. ఇంకెన్ని సినిమాలు ప్రకటిస్తారు? ఏది ముందు రిలీజ్ చేస్తారు? ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదంటున్నారు.
అదే సమయంలో ప్రశాంత్ వర్మ లైనప్ లో ఉన్న సినిమాలు అన్నింట్లో భారీగా వీఎఫ్ ఎక్స్ వర్క్ ఉండనుందని సమాచారం. దీంతో అవి ఎప్పటికి పూర్తి అవుతాయో.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని తెలియడం లేదని అంటున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. జై హనుమాన్ మూవీని అక్టోబర్ లాస్ట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట ప్రశాంత్ వర్మ. అందులో కన్నడ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రీప్రొడక్షన్ వర్క్.. ఏడాది పాటు జరగనుందట.
2025 మేలో జై హనుమాన్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతలో మోక్షు బాబు మూవీని మొదలు పెట్టనున్నారని వినికిడి. ఆ సినిమాలో బాలయ్య కూడా నటిస్తారని సమాచారం. ప్రాజెక్ట్ కాస్త భారీగా ఉంటుంది కనుక.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. జై హనుమాన్ ను మాత్రం 2026 లేదా 2027లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అంత కన్నా ముందే మోక్షు మూవీ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి అధీరా, ఆక్టోపస్ సినిమాలు సంగతేంటో? అన్ని చిత్రాలను ఒకేసారి లైనప్ లో చేర్చడం వెనుక అసలు ప్లాన్ ఏంటో? ప్రశాంత్ వర్మకే తెలియాలి.