వేట్టయన్ కు ప్రీక్వెల్.. సజ్జనార్ గురించి జ్ఞానవేల్ తెలుసుకున్నారా?

అయితే తాజాగా దర్శకుడు జ్ఞానవేల్.. వేట్టయన్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు.

Update: 2024-10-17 12:42 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. రీసెంట్ గా వేట్టయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. దసర కానుకగా థియేటర్లలో రిలీజ్ అయింది. వారం రోజుల్లో రూ.200 కోట్లు వసూలు చేసిన వేట్టయన్.. ఇప్పుడు రూ.250 మార్క్ వైపు దూసుకుపోతోంది. అయితే తాజాగా దర్శకుడు జ్ఞానవేల్.. వేట్టయన్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు.

రజనీకాంత్ అభిమానులను అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌ తో వేట్టయన్ ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. స్పెషల్ కాన్సెప్ట్ తో మూవీ తీసి రజినీ మార్క్ మూమెంట్స్ ను ఆడియన్స్ కోసం యాడ్ చేసినట్లు చెప్పారు. తలైవా తనను పూర్తిగా నమ్మారని వెల్లడించారు. ఆయన పాత్రకు ఎలివేషన్స్ ఇచ్చినప్పుడు.. ఎంతో ఉత్సాహంగా నటించారని పేర్కొన్నారు. అందుకే అందరికీ సంతృప్తికరంగా ఉండే చిత్రాన్ని తీశానని అన్నారు.

దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్‌ కౌంటర్ల గురించి వచ్చిన వార్తలు తనను ప్రభావితం చేశాయని తెలిపారు జ్ఞానవేల్. తనకు వచ్చిన అనుమానాలను క్లైమాక్స్ లో చూపించినట్లు చెప్పారు. విద్యా వ్యవస్థలోని లోపాలను కూడా మూవీలో ఎత్తిచూపినట్లు పేర్కొన్నారు. సినిమా కోసం సుప్రీంకోర్టు ఇప్పటికే ఇచ్చిన తీర్పులపై పరిశోధన జరిపానని, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ గురించి తెలుసుకోలేదని అన్నారు.

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో కూడిన సంగీతాన్ని అందించడంలో దిట్ట అని కొనియాడారు. అందుకే ఆయనను సెలెక్ట్ చేసినట్లు తెలిపారు. ఫహాద్ ఫాజిల్, రానా తమ రోల్స్ కు సరైన ఎంపిక అని చెప్పారు. ఇద్దరి డేట్స్ మధ్య ఒకసారి క్లాష్ వచ్చిందని.. తర్వాత అంతా సెట్ అయినట్లు చెప్పారు. జై భీమ్ తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉందని, కానీ రజనీకాంత్ తో పనిచేసే అవకాశం వచ్చి వేట్టయన్ తీశానని చెప్పారు.

50 శాతం ఎంటర్టైన్మెంట్, 50 శాతం సామాజిక అంశాలను కలుపుకొని వేట్టయన్ మూవీ చేయాలని అనుకున్నానని, అందుకే ఏ విషయంలోనూ రాజీ పడలేదని తెలిపారు. ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న వేళ.. తాను వేట్టయన్ ప్రీక్వెల్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అసలు హీరో ఎన్‌ కౌంటర్ స్పెషలిస్ట్ ఎలా అయ్యారు? పోలీస్ ఇన్‌ ఫార్మర్‌ గా ఎలా మారాడు? అనే పాయింట్స్ తో వేట్టయన్ ప్రీక్వెల్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. నవంబర్ లో తన కొత్త ప్రాజెక్టుల కోసం వెల్లడిస్తానన్నారు. మరి వేట్టయన్ ప్రీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News