సంధ్యలో 'పుష్ప 2' ఆల్‌టైమ్ రికార్డ్
తాజాగా ఈ సినిమా సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. సంధ్య థియేటర్‌లో 51 రోజులు 206 షోలు పడగా 1,04580 మంది ప్రేక్షకులు సినిమాను చూశారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2' సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్‌ని థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. రీలోడెడ్ పుష్ప ను చూసేందుకు మరోసారి అభిమానులు థియేటర్ బాట పట్టారు. ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప 2 సినిమా తన రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఈ సినిమా అరుదైన రూ.2000 కోట్ల రికార్డ్‌ని చేరినట్లు తెలుస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఈ నెంబర్ చేరిన సినిమాగా పుష్ప 2 అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు.
తాజాగా ఈ సినిమా సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. సంధ్య థియేటర్‌లో 51 రోజులు 206 షోలు పడగా 1,04580 మంది ప్రేక్షకులు సినిమాను చూశారు. ఒక్క సంధ్య థియేటర్‌లోనే రూ.1,89,75,880ల వసూళ్లు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఒక సింగిల్ స్క్రీన్‌లో ఈ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న దాఖలాలు లేవు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెల్సిందే. అయినా ఆ థియేటర్‌లోనే అత్యధిక వసూళ్లు నమోదు కావడం ఆశ్చర్యం కలిగించే విషయం.
సాధారణంగా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి, ప్రదేశానికి వెళ్లేందుకు జనాలు ఆసక్తి చూపించరు. కానీ సంధ్య థియేటర్‌లో అంత పెద్ద సంఘటన జరిగినా 50 రోజుల్లో లక్ష మందికి పైగా జనాలు పుష్ప 2 ను చూసేందుకు వెళ్లారు. సినిమాకు హిట్ టాక్ రావడంతో పాటు కొన్ని సంఘటనల కారణంగా సంధ్య థియేటర్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అందుకే అక్కడ అత్యధిక వసూళ్లు నమోదు అయ్యి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్‌లో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకోవడంతో మరోసారి సంధ్య 70ఎంఎం వార్తల్లో నిలిచింది.
అల్లు అర్జున్ అద్భుతమైన నటనతో పాటు సుకుమార్ తనదైన మార్క్ స్క్రీన్ ప్లేతో, యాక్షన్ సన్నివేశాలతో పుష్ప 2 స్థాయిని పెంచారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా చివర్లో వచ్చిన కిస్సిక్ సాంగ్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా మూడు గంటలు మించి ఉన్నా ఇటీవల 20 నిమిషాలు అదనంగా చేర్చినా సినిమాకు మంచి స్పందన వచ్చింది. పుష్ప 2 సినిమా సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు అంతా పుష్ప 3 కోసం వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మరో వైపు సుకుమార్ తన తదుపరి సినిమాని చరణ్ తో చేయనున్నారు. వారి కమిట్‌మెంట్స్ పూర్తి అయిన తర్వాత పుష్ప 3 పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.