గోద్రా రైలు దహనంతో తెలుగు నటి లింక్?
తాజాగా సబర్మతి రిపోర్ట్ టీజర్ రిలీజ్ కాగా, ఇందులో రాశీ పాత్ర ఆశ్చర్యపరిచింది
యువతరం మెచ్చే రొమాంటిక్ కామెడీల్లో నటించింది రాశీ ఖన్నా. ప్రేమకథా చిత్రాల్లో గ్లామరస్ పాత్రలతో కుర్రకారు గుండెల్లో నిలిచింది. సుప్రీమ్-వరల్డ్ ఫేమస్ లవర్-తొలి ప్రేమ-థాంక్యూ వంటి చిత్రాలలో రాశీ బబ్లీ లుక్, అద్భుతమైన నటనను యూత్ మర్చిపోలేదు. అందుకే ఇప్పుడు రాశీ కొత్త ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇటీవల నిజఘటనల ఆధారంగా రూపొందించిన 'సబర్మతి రిపోర్ట్'లో రాశీ నటించింది. ఫర్జీ లాంటి ప్రయోగాత్మక వెబ్ సిరీస్ లో నటించిన రాశీ, ఇంతలోనే మరో ప్రయోగాత్మక సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ ప్రయత్నాలు నటిగా తనను తాను విస్తరించుకునేందుకు చేస్తున్న ట్రయల్స్ గా భావించాలి.
తాజాగా సబర్మతి రిపోర్ట్ టీజర్ రిలీజ్ కాగా, ఇందులో రాశీ పాత్ర ఆశ్చర్యపరిచింది. రంజన్ చందేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2002 గోద్రా రైలు దహనం సంఘటన తర్వాత జరిగిన కొన్ని సున్నితమైన అంశాలను హైలైట్ చేస్తుంది.
ఈ విషాదం తర్వాత నాడు చాలా పరిశోధన జరిగింది. అధికారులు ఘటనకు కారకులను పట్టుకునేందుకు చాలా శ్రమించారు. ఆ సమయంలో ఏం జరిగింది? అన్నది కళ్లకు కట్టారని టీజర్ చెబుతోంది.
రాశి పాత్రకు సంబంధించిన వివరాలు ఏవీ బయటకు తెలియకపోయినా కానీ, గోద్రా ఘటన అనంతరం క్లిష్ట పరిస్థితిపై పరిశోధనకు సహకరించే కీలక వ్యక్తిగా తన పాత్ర ఉంటుందని అర్థమైంది. రెగ్యులర్ పాత్రలో ఈసారి నటించలేదన్నది అర్థమవుతోంది. నటిగా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించే అవకాశాన్ని రాశీ అందుకుంది. ట్వల్త్ ఫెయిల్, మసాన్ లాంటి చిత్రాల్లో శక్తివంతమైన నటనతో ఆకట్టుకున్న విక్రాంత్ మాస్సే ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించాడు. విక్రాంత్- రాశీ నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరికీ మంచి పేరొస్తుందని టీజర్ క్లారిటీనిచ్చింది.