వాళ్లను చూసి రాజమౌళి అసూయ!
కంటెంట్ బాగుంటే కటౌట్ తో పనిలేదని మరోసారి నిరూపించిన సినిమాలు.
టాలీవుడ్ లో మాలీవుడ్ స్టార్ల హవా చూస్తూనే ఉన్నాం. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ ఈ మద్య తెలుగు సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. మోహన్ లాల్...మమ్ముట్టి..దుల్కర్ సల్మాన్..పృథ్వీరాజ్ సుకుమారన్.పహాద్ పాసల్ లాంటి వాళ్లు ఇప్పటికే బాగా ఫేమస్. మాలీవుడ్ కంటెంట్ కి తెలుగులో మంచి ఆదరణ దక్కుతోంది. అనువాద రూపంలో ఆ సినిమాలు ఇక్కడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన `మంజుమ్మల్ బాయ్స్`..`ప్రేమలు` లాంటి సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కంటెంట్ బాగుంటే కటౌట్ తో పనిలేదని మరోసారి నిరూపించిన సినిమాలు. తాజాగా మలయాళం నటుల ట్యాలెంట్ ని చూసి దర్శక శిఖరం రాజమౌళి సైతం ప్రశంసించకుండా ఉండలేకపోయారు. `మలయాళంలో మంచి నటులు ఉన్నారని చెప్పడానికి నాకు కొంత అసూయగా ఉంది. నేను యాక్షన్ సన్నివేశాలతో సాధించే చప్పట్లు.. మలయాళం నటులు చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో సొంతం చేసుకుంటున్నారు. అందుకు వాళ్లను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అందంత ఈజీ కాదు. ఎంతో హోమ్ వర్క్ చేస్తే తప్ప రాదు. వాళ్లు ఎంత కష్టపడుతున్నారు అనే దానికి వాళ్ల స క్సెస్ ని చూసి చెప్పొచ్చు.
అక్కడ దర్శకులు ప్రతీ పాత్రని ఎంతో శ్రద్దగా తీర్చి దిద్దుతారు. అందుకే ఇది సాధ్యమవుతుంది. మా కార్తికేయ `ప్రేమలు` అనే సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా మారినందుకు సంతోషిస్తున్నా. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి` అని అభిప్రాయపడ్డారు. కానీ ఇంతవరకూ రాజమౌళి తెరకెక్కించిన ఏ సినిమాలో మలయాళ నటులు లేరు. ఇతర భాషల నుంచి హీరోయిన్లు తెచ్చుకున్నారు గానీ..మలయాళం నటులకు ఇంతవరకూ అవకాశం ఇవ్వలేదు.
మరి ఎస్ ఎస్ ఎంబీ 29 లో అక్కడ ప్రతిభను గుర్తించి వాళ్లకు అవకాశాలిస్తారేమో చూడాలి. అయితే రాజమౌళి వీలైనంత వరకూ తెలుగు నటులతోనే తెరను నింపేస్తారు. హీరోయిన్ల ని దిగుమతి చేస్తారు తప్ప నటుల విషయంలో ఆయన స్థానికతకు పెద్ద పీఠ వేస్తారు. చాలా రేర్ గానే బయట నటులు కనిపిస్తారు.