రజినీకాంత్ వేట్టయన్.. అసలు కథ ఇదేనా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ ఇంకొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది

Update: 2024-10-06 09:30 GMT

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ ఇంకొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. రజినీకాంత్ జైలర్ తో భారీ హిట్లు కొట్టిన నేపథ్యంలో, ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

‘వేట్టయన్’ సినిమా కాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. రజినీకాంత్ ఇందులో ఓ పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో రజినీకాంత్ యాక్షన్ సీన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ చూసిన తర్వాత, ఆడియన్స్‌లో మరింత హైప్ పెరిగింది. రజినీ అభిమానులు మాత్రమే కాకుండా, ఇతర సినీ ప్రియులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రజినీ మాస్ స్టైల్, యాక్షన్, డైలాగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తుండటం మరో ప్రత్యేకత. ఆయన ఇందులో ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ‘వేట్టయన్’ సినిమా కథకు సంబంధించి ఇటీవల నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ భారతదేశంలో జరిగిన భారీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్కామ్ ఆధారంగా నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, సాంకేతికత, వాణిజ్యంపై ఆధారపడిన స్కామ్‌లు ఈ కథకు నాంది అని టాక్. ఇది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, అభిరామి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ స్టార్ కాస్టింగ్‌తో సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుందని స్పష్టమైంది. అలాగే, అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించడం మరో ప్రత్యేకత. ‘వేట్టయన్’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని టాక్.

సినిమాలో యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు రజినీ మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండనుంది. ట్రైలర్, పోస్టర్స్‌తో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ‘వేట్టయన్’, రజినీకాంత్ అభిమానులకే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఇక సినిమా కథ నిజంగానే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్కామ్‌ను ఆధారంగా తీసుకున్నదా, లేదా అనేది సినిమా విడుదలయ్యే వరకు తెలియదు. ‘వేట్టయన్’ అక్టోబర్ 10న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. మరి రజినీకాంత్ కెరీర్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News