ఫోకస్ షిఫ్ట్ చేసిన రామ్ చరణ్..!
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మూవీ కచ్ఛితంగా సక్సెస్ అందిస్తుందని రామ్ చరణ్ గట్టిగా నమ్మారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోలోగా హిట్టు కొట్టి చాలా కాలం అయింది. చివరగా 2018లో 'రంగస్థలం' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చెర్రీ.. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి RRR లాంటి భారీ విజయాన్ని పంచుకున్నారు. దీనికి ముందు చేసిన 'వినయ విధేయ రామ', తర్వాత తన తండ్రితో కలిసి చేసిన 'ఆచార్య' చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి. దాదాపు ఆరేళ్ల తరువాత చరణ్ సోలోగా నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ తీవ్ర నిరాశ పరిచింది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మూవీ కచ్ఛితంగా సక్సెస్ అందిస్తుందని రామ్ చరణ్ గట్టిగా నమ్మారు. మూడున్నరేళ్లు ఈ సినిమాపైనే వర్క్ చేశారు. దీని కోసం బుచ్చిబాబు చిత్రాన్ని కూడా సెట్స్ మీదకు తీసుకురాలేదు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఫైనల్ రిజల్ట్ ఏంటనేది ఈ వీకెండ్ తో తెలిపోతుంది.
అయితే రామ్ చరణ్ మాత్రం 'గేమ్ ఛేంజర్' విషయంలో తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు ఈ సంక్రాంతికి మరింత ఆనందంగా ఉందని ఇటీవల ఓ నోట్ షేర్ చేశారు. ఈ సినిమాకి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. అందరూ గర్వపడేలా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇవ్వడాన్ని కొనసాగిస్తానని, పాజిటివ్ ఎనర్జీతో కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా హామీ ఇస్తున్నానని రాసుకొచ్చారు. దీన్ని బట్టి చరణ్ సానుకూల దృక్పథంతో తదుపరి సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.
నిజానికి 'గేమ్ ఛేంజర్' సినిమాకి రామ్ చరణ్ స్పెషల్ ఇంటర్వ్యూలు ఏమీ ఇవ్వలేదు. రిలీజైన తర్వాత కూడా మీడియాకి అందుబాటులోకి రాలేదు. తన ఇంటికి వచ్చిన మెగా ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలిపి, భోజనం పెట్టి పంపించారు. రెండు రోజులు గడిచాక సోషల్ మీడియాలో థ్యాంక్స్ నోట్ పంచుకున్నారు. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత మేకర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. థ్యాంక్స్ మీట్ కానీ, సక్సెస్ సెలబ్రేషన్స్ కానీ ఏమీ చేయలేదు. దీంతో సినిమా ఫలితాన్ని అందరూ యాక్సెప్ట్ చేసినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు.
మెగా అభిమానులు సైతం 'గేమ్ ఛేంజర్' సంగతి వదిలేసి, 'RC 16' మీదకు ఫోకస్ షిఫ్ట్ చేశారు. గత రెండు రోజులుగా ఈ సినిమా గురించే సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. డైరక్టర్ బుచ్చిబాబు మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని.. ఈ మూవీతో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం గురి మిస్సవ్వదని నమ్మకంగా ఉన్నారు. మెగా వారసుడు సోలోగా హిట్టు కొట్టి ఏడేళ్ళు కావడంతో, రాబోయే చిత్రంతో తప్పకుండా తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం ఏర్పడింది. చూద్దాం.. బుచ్చితో కలిసి చెర్రీ ఎలాంటి సినిమాతో వస్తారో..!