చరణ్‌ అన్‌ఫాలో వివాదం.. ఇది అసలు మ్యాటర్!

సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, హీరో తీరుతెన్నులు కీలకమైన పాత్ర పోషిస్తాయి.;

Update: 2025-03-20 12:33 GMT

సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, హీరో తీరుతెన్నులు కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే హిట్‌ సాంగ్స్‌కి కొన్నిసార్లు అందరి టాలెంట్ కూడా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇక ఫ్లాప్‌ అయితే మాత్రం విమర్శలు ఎవరినైనా తాకుతాయి. తాజాగా ఈ అంశమే హాట్‌ టాపిక్‌గా మారింది. రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్ మూవీకి తమన్‌ సంగీతం అందించారు.

అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా పాటలు ఊహించిన స్థాయిలో వైరల్ కాలేదని, హుక్‌ స్టెప్పులు లేకపోవడమే అందుకు కారణమని తమన్‌ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు చరణ్‌ అభిమానులకు మింగుడు పడలేదు. పాటలు పాపులర్‌ కావడం కేవలం మ్యూజిక్‌ డైరెక్టర్‌ వల్లే కాదని, కొరియోగ్రాఫర్‌ తప్పిదం కూడా కారణమని తమన్‌ చెప్పడం చర్చనీయాంశమైంది. దీంతో రామ్‌ చరణ్‌ తమన్‌ను సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో చేశారని వార్తలు హల్‌చల్‌ చేశాయి.

స్క్రీన్‌షాట్లు షేర్‌ చేస్తూ తమన్‌ కామెంట్స్‌ తర్వాత చరణ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ నెటిజన్లు ప్రచారం చేయడం మొదలైంది. ఈ వివాదం పెద్దదవుతుండగానే, రామ్‌ చరణ్‌ టీమ్‌ దీనిపై క్లారిటీ ఇచ్చింది. చరణ్‌ టీమ్‌ ప్రకటన ప్రకారం, అసలు చరణ్‌ ఎప్పుడూ తమన్‌ను ఫాలో కాలేదట. ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చాలా తక్కువ మందినే ఫాలో అవుతారని, వారిలో కుటుంబసభ్యులు, అతిథి నటీనటులే ఉంటారని వివరించారు.

దీంతో, చరణ్‌ అన్‌ఫాలో చేశాడనే ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఇలా క్లారిటీ ఇచ్చినా, ఈ ప్రచారం తగ్గలేదు. అభిమానులు తమన్‌ కామెంట్స్‌ వల్లనే ఈ వివాదం ముదిరిందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ఇదే తరహాలో గేమ్‌ ఛేంజర్ పాటలపై తమన్‌ గతంలో మరో ఇంటర్వ్యూలో మాట్లాడడం కూడా వైరల్‌ అవుతోంది.

గతంలో సినిమా రిలీజ్ కు ముందు ఇండియన్‌ ఐడల్‌ తెలుగు షోలో పాల్గొన్నప్పుడు, "ప్రభుదేవా మాస్టర్‌ కొరియోగ్రఫీ అదిరిపోయింది. పాటలు స్క్రీన్‌పై అద్భుతంగా కనిపిస్తున్నాయి" అంటూ ప్రశంసలు గుప్పించాడు. కానీ విడుదల అనంతరం, "హుక్‌ స్టెప్పులు లేకపోవడం వల్ల వ్యూస్‌ తగ్గాయి" అంటూ మరో ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. దీంతో అభిమానులు అయోమయానికి గురయ్యారు.

Tags:    

Similar News