IIFA 2024 ఉత్సవం: ఐశ్వ‌ర్యారాయ్‌తో రామ్ చ‌ర‌ణ్‌?

తాజాగా ఐఐఎఫ్ఏ ఉత్స‌వ ఇన్ స్టా లో రామ్ చ‌ర‌ణ్ స్ట‌న్నింగ్ అప్పియ‌రెన్స్ ఉంటుంద‌న్న ప్ర‌క‌ట‌న అభిమాన‌ల‌ను మ‌రింత ఉత్సాహ‌ప‌రుస్తోంది.

Update: 2024-09-14 10:12 GMT

IIFA 2024 ఉత్స‌వానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ ఉత్స‌వంలో సినీప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన దిగ్గ‌జాలు పాల్గొన‌నున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహా నంద‌మూరి బాలకృష్ణ తదితరులు సెప్టెంబర్ 27న అబుదాబి `యస్` ఐలాండ్‌లో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌లో పాల్గొన‌నున్నారు.

రామ్ చరణ్ గౌరవ అతిథిగా ఈవెంట్‌కి ప్ర‌త్యేక‌త‌ను ఆపాదించ‌నున్నారు. దీంతో ఒకే ఈవెంట్లో మెగాస్టార్ - మెగా ప‌వ‌ర్ స్టార్ ఇద్ద‌రినీ ఒకే ఫ్రేమ్‌లో వీక్షించేందుకు అభిమానుల‌కు అవ‌కాశం ఉంది. అలాగే సమంతా రూత్ ప్రభుని సత్కరించనున్నారు. `ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియన్ సినిమా` అవార్డు స‌మంత‌కు ద‌క్క‌నుంది. తనకు ఈ గౌరవం ఇచ్చినందుకు IIFA ఉత్సవానికి నటి స‌మంత‌ కృతజ్ఞతలు తెలిపింది. ఆస్కార్-విజేత సౌండ్ డిజైనర్ ర‌సూల్ పూకుట్టి, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వంటి ప్ర‌ముఖుల‌ను ఈ వేదిక‌పై సత్కరిస్తారు. వీరంతా భారతీయ సినిమా దృశ్య, శ్రవణ అనుభవాన్ని రూపొందించడంలో కీలక పాత్రలు పోషించారు.

అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో స్టార్-స్టడెడ్ నైట్ ఈవెంట్ కోసం స‌ర్వస‌న్నాహ‌కాల్లో ఉంది. ఈ ఉత్స‌వం భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లోని ప్రముఖులు, సౌత్ సినిమా నుండి సూపర్ స్టార్‌లతో విల‌క్ష‌ణ వేడుక‌గా మార‌నుంది. వేదికపై నిప్పులు చెరిగే ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉండ‌నున్నాయి. IIFA ఉత్సవ వేదిక‌ దక్షిణ భారత సినిమా అత్యుత్తమ ప్రతిభతో ఒక అద్భుతమైన స‌మావేశ మందిరంగా మార‌నుంది. తాజాగా ఐఐఎఫ్ఏ ఉత్స‌వ ఇన్ స్టా లో రామ్ చ‌ర‌ణ్ స్ట‌న్నింగ్ అప్పియ‌రెన్స్ ఉంటుంద‌న్న ప్ర‌క‌ట‌న అభిమాన‌ల‌ను మ‌రింత ఉత్సాహ‌ప‌రుస్తోంది.

ఇదే వేదిక‌పై బాలీవుడ్ తార‌లు:

ఈ వేడుకలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, మణిరత్నం వంటి దిగ్గజాలు సంద‌డి చేయ‌నున్నారు. ఈ లైనప్‌లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, చియాన్ విక్రమ్, శివ కార్తికేయన్, రిషబ్ శెట్టి, నివిన్ పౌలీ, సింబు (STR) వంటి స్టార్‌లు కూడా ఉన్నారు. దక్షిణ భారత సినిమా గొప్పత‌నాన్ని వైవిధ్యాన్ని వీరంతా ప్రదర్శించిన ఘ‌నులు.ఈ ఈవెంట్ సృజనాత్మకత, ప్రతిభ, సాంస్కృతిక వారసత్వం తాలూకా శక్తివంతమైన ప్రదర్శనగా ఉంటుంది. ఇది చిరస్మరణీయ క్షణాలతో నిండిన అంద‌మైన రాత్రిగా నిలుస్తుంది.

Tags:    

Similar News