దేశభక్తిని చాటి చెప్పే RAM.. ట్రైలర్ ఎలా ఉందంటే
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. సైంధవ్ డైరెక్టర్ శైలేష్ కొలను ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
దేశభక్తి సినిమాలకు ఆడియన్స్ లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. తాజాగా అలాంటి కథతో ర్యాపిడ్ యాక్షన్ మిషన్- RAM సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా పరిచయం కానున్నారు. సూర్య అయ్యల సోమయాజుల హీరోగా, ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతంతో పాటు మనతో కాదురా బై సాంగ్ అందరినీ అట్రాక్ట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. సైంధవ్ డైరెక్టర్ శైలేష్ కొలను ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'లైఫ్ ఈజ్ ఏ వార్.. నువ్వు ఒంటరిగా ఉన్నా.. చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా.. నీ పోరాటం నువ్వే చేయాలి.. ఆ పోరాటంలో నా రామ్ గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది.. గెలుస్తావ్ కదా?' అంటూ తండ్రి చెప్పే మాటలతో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఈ 60 ఏళ్ల స్వాతంత్ర్యం ప్రజలది కాదు.. అధికారులది కాదు.. రాజకీయ నాయకులది మాత్రమే.. మీరు అప్పుడూ బానిసలే.. ఇప్పుడూ బానిసలే.. ఎప్పుడూ బానిసలే' అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ ఈ సినిమా నేపథ్యం ఏమిటనేది క్లారిటీ ఇస్తోంది.
'తాత-తండ్రి, కొడుకు-కోడలు, మనవడు-మనవరాలు ఆల్రెడీ తట్టాబుట్టా సర్దేసుకున్నారు. వీలైతే రామరాజ్యం, లేకుంటే ప్రజల రాజ్యం, మధ్యలో కుటుంబాలు వారసత్వాలు మంటలో కలపాలి భాయ్' అంటూ సూర్య పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టేశారు. 'నీ తల్లి మీద గన్ పెట్టినందుకు ఇంత అల్లాడిపోతున్నావే.. దేశంలో ఎక్కడి పడితే అక్కడ బాంబులు పెట్టాం' అంటూ విలన్ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సాయి కుమార్ డైలాగ్ డెలివరీ ఎప్పటిలానే వేరెలెవెల్.
ఈ సినిమాలో దేశ భక్తిని చాటే ఎన్నో డైలాగ్స్ చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. కళ్లల్లో త్రివర్ణ పతాకాన్ని చూపించే గన్ షాట్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మొత్తంగా సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో ట్రైలర్ వందశాతం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.
హీరో సూర్య అయ్యల సోమయాజుల తొలి సినిమాలోనే తన నటనతో అదరగొట్టారు. ఫైట్ సీన్లలో దుమ్మదులిపేశారు. డైరెక్టర్ ఇచ్చిన ఎలివేషన్లతో ట్రైలర్ లో ఓ రేంజ్ లో కనిపిస్తున్నారు. రొమాంటిక్ సీన్లలో కూడా బాగానే యాక్ట్ చేశారు. అటు హీరోయిన్ కనిపించిన టైమ్ కాసేపే అయినా.. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ మిహిరామ్ వైనతేయ మేకింగ్ విధానం బాగుంది. న్యూ డైరెక్టర్ అయినప్పటికీ సరికొత్త తరహాలో కథను ఎలివేట్ చేసినట్లు అనిపిస్తుంది. విజువల్స్, నటీనటుల ఎంపిక, క్యారెక్టర్స్ డిజైన్ చేసిన విధానం అతని ప్రతిభను హైలెట్ చేస్తున్నాయి. ఇక సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్ రెడీ చేశారు.
భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా, ధరణ్ సుక్రే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. దీపికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ ఎస్ఎం విజన్‌తో కలిసి దీపికాంజలి వడ్లమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా.. థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. రిపబ్లిక్ డే కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.