లీకులపై రష్మిక మందన్న అసహనం!
ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందకు తీసుకొచ్చేలా చకచకా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య 'పుష్ప-2` చిత్రీకరణ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందకు తీసుకొచ్చేలా చకచకా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం 'పుష్ప 2` షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూట్ నుంచి ఓ ఫోటో లీక్ అయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ చీర కట్టుకొని కూర్చున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే ఆ జాతరకు రెడీ అయ్యేలాగా గతంలోనే అల్లు అర్జున్ చీర కట్టి అమ్మవారిలా ముస్తాబైన పోస్టర్ ని రిలీజ్ చేశారు. తాజాగా లీక్ అయిన ఫొటోలో అల్లు అర్జున్ అదే గెటప్ లో రెడీ అవుతున్నట్టు ఉంది. దీంతో `పుష్ప 2` ఆన్ సెట్స్ లీక్ అందర్నీ గందరగోళానికి గురి చేస్తుంది. ఫోటోలు ఎలా లీక్ అవుతున్నాయో తెలియక యూనిట్ తల పట్టుకుంటుంది.
రిలీజ్ కి ముందు ఈ లీకుల బెడద ఏంటి? అని ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై రష్మిక మందన్న అసహనం వ్యక్తం చేసింది. 'షూటింగ్ సెట్స్ నుంచి నటీనటుల చిత్రాల్ని లీక్ చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈసినిమా కోసం ఎంతో మంది ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. అలా అని చెప్పి లీకైన ఫోటోలు షేర్ చేయకూడదు. సినిమాకి సంబంధించిన ఫోటోలు ముందే చూస్తే ఆసక్తి ఉండదు.
సరైన సమయంలో సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. థియేటర్లో వంద శాతం వినోదాన్ని పంచడం కోసం టీమ్ అంతా ఎంతో శ్రమిస్తుంది. దయచేసి సినిమా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించొద్దు. పుష్ప-2 ఉన్న ఆసక్తిని నేను అర్దం చేసుకోగలను` అని తెలిపింది.