ఆ కామెడీ రీమేక్.. రిస్కేమో రాజుగారు?
దిల్ రాజు దీన్ని నిర్మించబోతున్నారని, మాతృక డైరెక్టర్ అనిల్ రావిపూడియే దీనికి కూడా దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగుతోంది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్కెట్ డైనమిక్స్‌ను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా సినిమాలను నిర్మించి క్యాష్ చేసుకుంటారన్న పేరు ఉంది. అయితే ఇప్పుడాయన ఓ తప్పును మళ్లీ రిపీట్ చేయబోతున్నారని అనిపిస్తోంది. అనవసరంగా లేని సమస్యలను తల మీద వేసుకోబోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వివరాళ్లోకి వెళితే.. 2019లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన ఎఫ్ 2 చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు దీన్ని నిర్మించబోతున్నారని, మాతృక డైరెక్టర్ అనిల్ రావిపూడియే దీనికి కూడా దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని చెబుతున్నారు. ఈ వార్తలు వినడానికి బాగానే ఉన్నాయి కానీ ఎంత వరకు ఈ రీమేక్ సక్సెస్ అవుతుందా అంటే అనుమానాలే ఎక్కువ వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే ఎఫ్ 2 కామెడీ... 2019లో హిట్ అయిపోయింది కానీ ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన విధానం మరింత మారిపోయింది. ఇప్పుడలాంటి సిల్లీ కామెడీని ఆదరించే పరిస్థితుల్లో వారు లేరని అనిపిస్తోంది. ఇప్పుటికే ఆ చిత్రాన్ని యూట్యూబ్ హిందీ డబ్బింగ్ వెర్షన్లో చాలా మంది చూసేశారు. మరి ఇలాంటి సమయంలో మరో ఇద్దరు హీరోలతో కలిసి ఈ సినిమా హిందీలో రీమేక్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటే? కాదనే అనిపిస్తోంది.
అసలే దిల్ రాజు ఇప్పటికే జెర్సీ, హిట్ లాంటి చిత్రాలను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ చిత్రాలు కనీసం రూ.10కోట్లను కూడా అందుకోలేదు. పైగా దిల్ రాజు ప్రస్తుతం రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ఇబ్బందులను, సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాకు తానే నిర్మాత అయినప్పటికీ కూడా దాని గురించి ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇలాంటి కష్టపరిస్థితుల్లో ఎఫ్ 2 లాంటి చిత్రాన్ని రీమేక్ చేయడం సరైనది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అవి దిల్ రాజును మరిన్ని కష్టాల్లోకి నెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. చూడాలి మరి దిల్ రాజు ఏం చేస్తారో...