మాలీవుడ్ లో హీరో శ్రీకాంత్ కొడుకు బిగ్ గ్యాంబ్లింగ్
Roshan Meka Mollywood Entry
శతాధిక చిత్రాల కథానాయకుడిగా హీరో శ్రీకాంత్ కి గుర్తింపు ఉంది. ఇటీవల అతడి వారసుడు రోషన్ మేకా కథానాయకుడిగా తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ తర్వాత టాలీవుడ్ లో గొప్ప అందగాడిగా రోషన్ మేకాకు గాళ్స్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. నిర్మలా కాన్వెంట్ - పెళ్లి సంద-డి లాంటి చిత్రాలతో ఆరంగేట్రమే నటుడిగా ఆకట్టుకున్నాడు. ఈ ప్రతిభావంతుడైన హీరో ఇప్పుడు మాలీవుడ్ లో ప్రవేశిస్తున్నాడు. అది కూడా సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలో కీలక పాత్రలో అవకాశం దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
మోహన్ లాల్ కథానాయకుడిగా బహుభాషా ఎపిక్ యాక్షన్ ఎంటర్ టైనర్-వృషభ ఇటీవల అభిమానుల నడుమ ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో లాల్ కొడుకుగా కీలక పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం మేరకు దర్శకనిర్మాతలు తెలుగు యువహీరో రోషన్ మేకాకు అవకాశం కల్పించారని తెలిసింది. వృషభలో మోహన్ లాల్ కొడుకుగా రోషన్ మేక నటించనున్నాడు. 2024లో అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా వృషభ ఒకటి. తండ్రి కొడుకుల నడుమ రసవత్తరంగా సాగే ఒక హై ఇంటెన్స్ స్టోరీతో తెరకెక్కుతోంది. భారీ తారాగణం.. అత్యాధునిక VFX .. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లతో అభిమానులను ఆకట్టుకుంటుందని తెలిసింది.
AVS స్టూడియోస్ అధినేత చిత్ర నిర్మాత అభిషేక్ వ్యాస్ మాట్లాడుతూ-``ఈ అద్భుతమైన చిత్రాన్ని భాషతో సంబంధం లేకుండా ప్రతిచోటా అభిమానులు ఆస్వాధించాలని దానికి తగ్గట్టుగా ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక జరిగింది. యువహీరో రోషన్ చాలా సమర్థుడు.. ప్రతిభావంతుడు.. అతడు ఈ పాత్రకు సజావుగా సరిపోతాడని మేం బలంగా భావిస్తున్నాము. సినిమాలో కీలక పాత్రకు గొప్ప న్యాయం చేస్తాడన్న నమ్మకం ఉంది. ఈ ప్రయాణంలో రోషన్ ను చేర్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాము`` అని తెలిపారు. రోషన్ మునుపటి చిత్రాల్లో తన నటనను పరిశీలించి సమర్థుడైన నటుడు అని అర్థమయ్యాక ఎంపిక చేసుకున్నామని దర్శకుడు నందకిషోర్ తెలిపారు. ``మోహన్ లాల్ సర్ తో స్క్రీన్ స్పేస్ ను పంచుకునే అవకాశం లభించడం నాకు చాలా పెద్ద అవకాశం. ఇది ఛాలెంజింగ్ రోల్.. నందా పాత్రలో జీవించడానికి నేను చాలా కష్టపడుతున్నాను. ఈ అద్భుతమైన చిత్రంలో నటించడం గౌరవంగా భావిస్తున్నాను`` అని రోషన్ మేకా వెల్లడించాడు.
AVS స్టూడియోస్ -బాలాజీ టెలిఫిల్మ్స్ సమర్పణలో రూపొందుతున్న వృషభ ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్లి 2024లో ప్రపంచవ్యాప్తంగా మలయాళం- తెలుగు- కన్నడ- తమిళం- హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్ లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ వ్యాస్ (AVS)- విశాల్ గుర్నానీ- జుహీ పరేఖ్ మెహతా - శ్యామ్ సుందర్ నటిస్తున్నారు. ఏక్తా కపూర్ -శోభా కపూర్ (బాలాజీ టెలిఫిలిమ్స్)తో కలిసి వరుణ్ మాథుర్ (కన్నెక్ట్ మీడియా) నిర్మిస్తున్నారు.