2900 కోట్ల ఆస్తుల‌తో దేశంలోనే క్రేజీ సూప‌ర్‌స్టార్

ద‌శాబ్ధాలుగా బాలీవుడ్ ని ఏల్తున్న స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇటీవలే వరుణ్ ధావన్ `బేబీ జాన్` చిత్రంలో అతిధి పాత్రలో కనిపించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-12-27 13:30 GMT

ద‌శాబ్ధాలుగా బాలీవుడ్ ని ఏల్తున్న స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇటీవలే వరుణ్ ధావన్ `బేబీ జాన్` చిత్రంలో అతిధి పాత్రలో కనిపించిన సంగ‌తి తెలిసిందే. నేటితో (డిసెంబర్ 27) ఈ స్టిల్ బ్యాచిల‌ర్ 59వ ఏట అడుగుపెట్టాడు. మూడు ద‌శాబ్ధాల కెరీర్ లో స‌ల్మాన్ ఖాన్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో స‌మున్న‌త స్థానాన్ని అలంక‌రిస్తున్నారు. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో అగ్ర క‌థానాయ‌కుడిగా అత‌డి స్థానం సుస్థిరంగా నిలిచి ఉంది. అయితే త‌న కెరీర్ ప‌థంలో అత‌డి సంపాద‌న ఎలా ఉంది? అంటే...

స‌ల్మాన్ నిక‌ర ఆస్తుల విలువ సుమారు 2,900 కోట్లు (సుమారు 350 మిలియన్ డాల‌ర్లు). అగ్ర‌క‌థానాయ‌కుడిగా అజేయ‌మైన‌ కెరీర్, వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడులు, విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి ఈ సంప‌ద వచ్చింది. సల్మాన్ ఖాన్ 1980ల చివరి నుండి భారతీయ చలనచిత్రంలో అగ్ర క‌థానాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు. కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్‌లను అందించాడు. అతడు ఒక్కో ప్రాజెక్ట్ కోసం దాదాపు 100 కోట్లు వసూలు చేస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థలో వ‌ర‌స చిత్రాల‌ను నిర్మిస్తూ కోట్లాది రూపాయ‌లు ఆర్జిస్తున్నాడు. బజరంగీ భాయిజాన్ , రేస్ 3 వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. నటనకు అతీతంగా స‌ల్మాన్ ఖాన్ అనేక వ్యాపార సంస్థల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్నాడు. 2013లో బీయింగ్ హ్యూమ‌న్ అనే దుస్తుల బ్రాండ్ ని ప్రారంభించాడు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు, బీయింగ్ హ్యూమన్ వ్యాపార స‌ర‌ళి వైవిధ్య‌మైన‌ది. 2020లో ప్రవేశపెట్టబడిన ఫిట్‌నెస్ ఉత్ప‌త్తుల వ్యాపారం పెద్ద స‌క్సెసైంది. భారతదేశం అంతటా ఈ వ్యాపారం వృద్ధి చెందింది. అతడి రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో కోట్లాది రూపాయ‌ల సామ్రాజ్యంగా విస్త‌రించి ఉంది. ముంబైలో ప‌లు చోట్ల అత‌డికి వంద‌ల కోట్ల విలువ చేసే రియ‌ల్ వెంచ‌ర్లు ఉన్నాయి.

ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని అతని నివాసం విలువ రూ.100-150 కోట్ల మధ్య ఉంటుంది. మహారాష్ట్రలోని పన్వెల్‌లో 150 ఎకరాల ఫామ్‌హౌస్ విలాసవంతమైన సౌకర్యాలతో అల‌రారుతోంది. దీని విలువ వంద‌ల కోట్లు. ముంబైలోని ఒక విలాసవంతమైన బీచ్ ప్రాపర్టీ విలువ‌ సుమారు 100 కోట్లు ఉంటుంద‌ని అంచనా. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ద్వారా, అలాగే బిగ్ బాస్ ద్వారా అత‌డు కోట్లాది రూపాయ‌లు ఆర్జిస్తున్నాడు. అత‌డి గ్యారేజీలో అత్యంత ఖ‌రీదైన కార్లు ఉన్నాయి.

Tags:    

Similar News