సల్మాన్ సోదరి బావ కొత్త ఫ్లాట్‌లోకి.. గ్యాంగ్‌స్టర్ బెదిరింపులే కారణమా?
బహుమతిగా ఇచ్చిన ఆ ఇంటిని అమ్మేసి హై సెక్యూరిటీ ఉన్న కొత్త భవంతిలోకి మారుతున్నారు. దీనిని బట్టి సల్మాన్ ఖాన్ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులందరికీ సెక్యూరిటీని పెంచే ప్రయత్నంలో ఉన్నారని గుసగుస మొదలైంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓవైపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్యా బెదిరింపులను ఎదుర్కొన్నాడు. అతడి స్నేహితుడైన బాబా సిద్ధిఖ్ హతం అయ్యాడు. ఇలాంటి సమయంలో అతడి కుటుంబానికి సంబంధించిన ప్రతి వార్తా మీడియాలో హైలైట్ గా మారుతోంది. ఇప్పుడు సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ, ఆమె భర్త ఆయుష్ శర్మ బాంద్రాలోని తమ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను 22 కోట్ల రూపాయలకు సేల్ చేసారని సమాచారం. ఈ జంట ఇప్పుడు వర్లీలోని విలాసవంతమైన భవనంలోకి మారారని తెలుస్తోంది.
2014లో అర్పిత- ఆయుష్ జంట వివాహం జరిగింది. ఈ సందర్భంగా చెల్లి బావల కోసం సల్మాన్ ఖాన్ విలాసవంతమైన సీఫేసింగ్ ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అపార్ట్ మెంట్ సల్మాన్ తన కుటుంబ సభ్యులతో నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది. సల్మాన్ కి తన చెల్లెలు అర్పిత అంటే అపారమైన ప్రేమ. అర్పితను ఆయుష్ పెళ్లాడాక.. సల్మాన్ బాలీవుడ్‌లో యువ హీరో నటనా జీవితం ఎదుగుదల కోసం సహకరించాడు.
సల్మాన్ బావ గారు ఆయుష్ 2018 చిత్రం 'లవ్‌యాత్రి'తో కథానాయకుడిగా అరంగేట్రం చేసాడు. 2021 ఏప్రిల్‌లో విడుదలైన యాంటిమ్ లో సల్మాన్ కీలక పాత్రను పోషించాడు. తర్వాత ఆయుష్ 'రుస్లాన్'లో నటించాడు. అర్పిత - ఆయుష్‌లకు ఇద్దరు పిల్లలు.కుమారుడు అహిల్, కుమార్తె అయత్ పెద్దవాళ్లవుతున్నారు.
సల్మాన్ కుటుంబాన్ని అలెర్ట్ చేసాడా?
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇంతకుముందు సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం గేలాక్సీపై ఎటాక్ చేసారు. తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. నలుగురు గ్యాంగ్ సభ్యులు తుపాకీతో సల్మాన్ ఉంటున్న అపార్ట్ మెంట్ పైకి గురి పెట్టి కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో వారికి పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడు అదే అపార్ట్ మెంట్ కి సమీపంలో ఉంటున్న చెల్లి -బావ హఠాత్తుగా తమ నివాసాన్ని మార్చారు. సల్మాన్ బహుమతిగా ఇచ్చిన ఆ ఇంటిని అమ్మేసి హై సెక్యూరిటీ ఉన్న కొత్త భవంతిలోకి మారుతున్నారు. దీనిని బట్టి సల్మాన్ ఖాన్ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులందరికీ సెక్యూరిటీని పెంచే ప్రయత్నంలో ఉన్నారని గుసగుస మొదలైంది.