గ్యాంగ్ స్టర్ (X) భాయ్: గుబులు గుబులుగా!
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తీవ్రమైన హత్య బెదిరింపులను ఎదుర్కొంటున్నాడు సల్మాన్ ఖాన్. బిష్ణోయ్ ముందు భాయ్ ప్రతాపం చెల్లుబాటు కావడం లేదు.;

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తీవ్రమైన హత్య బెదిరింపులను ఎదుర్కొంటున్నాడు సల్మాన్ ఖాన్. బిష్ణోయ్ ముందు భాయ్ ప్రతాపం చెల్లుబాటు కావడం లేదు. అతడు ఏ వైపు నుంచి ఎప్పుడు ఎలా చంపేస్తాడోననే భయం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఖాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీ మరణం తర్వాత పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. అప్పటి నుండి సల్మాన్ భద్రతను పెంచారు. తనకు తన కుటుంబానికి హత్యా బెదిరింపులు ఎదురయ్యాక సల్మాన్ ఇంకా భయపడుతూనే ఉన్నాడా? అంటే... అతడు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.
ఓవైపు హత్యా బెదిరింపులు ఎదురైనా సల్మాన్ మొక్కవోని ధీక్షతో తన సినిమాలను పూర్తి చేస్తూ ప్రమోషన్లకు అటెండవుతున్నాడు. మరోవైపు బిగ్ బాస్ రియాలిటీ షోని కూడా నడిపించేస్తున్నాడు. దీని అర్థం అతడు భయపడినా కానీ, దానిని బయటపడకపోవడం అంటూ విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం తన తదుపరి చిత్రం `సికందర్`ని సల్మాన్ ప్రమోట్ చేస్తున్నాడు. ఆ సమయంలో మీడియా సంభాషణలో అతడికి ఇదే ప్రశ్న ఎదురైంది. గ్యాంగ్ స్టర్ హత్యా బెదిరింపులకు ఇంకా భయపడుతున్నారా? అని ఒక విలేఖరి ప్రశ్నించాడు. దానికి భాయ్ హిందీలో సుదీర్ఘమైన జవాబు ఇచ్చాడు. ``భగవాన్, అల్లా సబ్ ఉంపర్ హై. జిత్ని ఉమర్ లిఖి హై, ఉత్ని లిఖి హై. బాస్ యాహి హై. కభి కభి ఇట్నే లోగోన్ కో సాథ్ మే లేకే చల్నా పడ్తా హై, బాస్ వోహి ప్రాబ్లం హో జాతి హై`` అని అన్నాడు. దేవుడిపైనే భారం.. దేనికైనా భగవంతుడిపై నమ్మకం ఉంచాలి! అని అతడు అన్నాడు.
అసలు సల్మాన్ వర్సెస్ లారెన్స్ బిష్ణోయ్ వైరానికి కారణం ఏమిటీ? అంటే... బిష్ణోయ్ కమ్యూనిటీ ఆరాధ్య దైవంగా ఆరాధించే నల్ల జింకను సల్మాన్ వేటాడి చంపడమే ఈ యుద్ధానికి కారణం. వేట ముగిసిన తర్వాత సల్మాన్ క్షమాపణలు కోరితే వదిలేస్తానని లారెన్స్ బిష్ణోయ్, అతడి కమ్యూనిటీ డిమాండ్ చేసింది. కానీ దానికి ససేమిరా అనేస్తున్నాడు సల్మాన్. సల్మాన్ అతడి తండ్రి సారీ చెప్పడం కుదరదని అన్నారు. ఇరువర్గాల నడుమా ఈగో గొడవ ముదిరి కోర్టున పడింది. వన్యప్రాణిని సంహరించిన కేసులో జైలుకి వెళ్లి వచ్చినా కానీ సల్మాన్ ని బిష్ణోయ్ లు వదిలి పెట్టలేదు. అతడికి నిరంతరం కంటిమీద కునుకుపట్టనివ్వడం లేదు. లారెన్స్ బిష్ణోయ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన నెట్ వర్క్ ని ఆపరేట్ చేస్తూ సెలబ్రిటీలకు కంటి నిండా నిదుర లేకుండా చేస్తున్నాడు.
2018లో జోధ్‌పూర్‌లో కోర్టుకు హాజరైన బిష్ణోయ్, ``మేము సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం. పని పూర్తయ్యాకే అందరికీ తెలుస్తుంది. నేను ఇప్పటివరకు ఏమీ చేయలేదు. వారు ఎటువంటి కారణం లేకుండా నాపై నేరాలు మోపారు! అని బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే వార్నింగ్ ఇచ్చాడు. 2024 ఏప్రిల్‌లో సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగినప్పుడు అసలు కథ ప్రారంభమైంది. ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ బిష్ణోయ్ అధికారిక ప్రకటన విడుదల చేసాడు. దీనిపై ముంబై పోలీసులు విచారిస్తున్నారు. విదేశాల నుంచి ఆపరేషన్ నిర్వహిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీస్ విడుదల చేసారు. కానీ ఆ తర్వాత అతడికి సంబంధించిన అప్ డేట్ ఏదీ రాలేదు. సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ ఈద్ కానుకగా విడుదలవుతుండగా, ఈ సినిమాతో 200 కోట్ల క్లబ్ అందుకుంటానని సల్మాన్ ధీమాను వ్యక్తం చేసారు.