అప్పుడు నా వల్ల కాదు అనిపించింది!

స్టార్‌ హీరోయిన్‌ సమంత హిందీ వెబ్ సిరీస్ 'సిటాడెల్‌ : హనీ బన్ని' స్ట్రీమింగ్‌ కు సిద్ధం అయింది.

Update: 2024-10-18 13:30 GMT

స్టార్‌ హీరోయిన్‌ సమంత హిందీ వెబ్ సిరీస్ 'సిటాడెల్‌ : హనీ బన్ని' స్ట్రీమింగ్‌ కు సిద్ధం అయింది. ఏడాది క్రితమే పూర్తి అయిన ఈ వెబ్‌ సిరీస్‌ని కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. సమంత అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆలస్యం అయిందని తెలుస్తుంది. స్ట్రీమింగ్ కి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నవంబర్ 7వ తారీకున స్ట్రీమింగ్‌ కి సిద్ధం అవుతోంది. ఈ మధ్య కాలంలో సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా సమంత ఎక్కువ మీడియా ముందుకు వస్తూ ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన అనారోగ్యం గురించి మరోసారి ప్రస్థావించింది.

సమంత మాట్లాడుతూ... సిటాడెల్‌ షూటింగ్‌ సమయంలోనే తాను అనారోగ్యం బారిన పడ్డాను. మయోసైటిస్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నాకు సిటాడెల్‌ మేకర్స్ తో పాటు తోటి నటీనటులు మద్దతుగా నిలిచారు. అందుకే నేను ఇప్పుడు ఇక్కడ మీ ముందు ఉన్నాను. నాకు కష్టంగా అనిపించిన సమయంలో వారు నాకు మద్దతుగా నిలిచారు. వారు నాలో ధైర్యంను నింపడంతో పాటు, ప్రతి విషయంలోనూ తోడుగా ఉండి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి అనారోగ్య సమస్యల నుంచి బయట పడేలా చేయడం జరిగింది. వారికి ఎప్పటికీ నేను కృతజ్ఞురాలిని అంటూ చెప్పుకొచ్చింది.

సిటాడెల్‌ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో తల తిరిగినట్లు అనిపించేది, విపరీతమైన తలనొప్పితో పాటు, శరీరం సహకరించేది కాదు. అప్పుడు నా వల్ల కాదు, షూటింగ్‌ మానేసి వెళ్లి పోవాలి అనిపించేది. అసలు ఒకానొక సమయంలో సిటాడెల్‌ ను పూర్తి చేస్తానా అనే అనుమానం సైతం కలిగింది. కానీ చిత్ర యూనిట్‌ సభ్యులు నాకు అందించిన సహకారం, వారు నా కోసం నిలబడిన తీరు కారణంగానే నేను నిలిచాను అంది. తన కెరీర్‌లో అత్యంత కష్టపడ్డ ప్రాజెక్ట్‌ ఏదైనా ఉంది అంటే అది సిటాడెల్‌ అంటూ సమంత చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సమంత హిందీ ప్రేక్షకులకు ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ తో దగ్గర అయింది. ఆ సిరీస్ వల్ల సమంతకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా సమంతను మరింత మంది హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇప్పుడు సిటాడెల్‌ స్ట్రీమింగ్‌ తర్వాత హిందీ లో సమంత నటిగా ప్రశంసలు అందుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం సిటాడెల్‌ కు అందుకున్న సమంత అంతే కష్టపడింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ సమంత నటించి మెప్పించిన తీరుకు ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించాల్సిందే. ఆకట్టుకునే అందంతో పాటు యాక్షన్‌ సన్నివేశాల్లో ఫైట్స్‌ తోనూ సమంత ఈ సిరీస్‌ ద్వారా మెప్పిస్తుంది.

Tags:    

Similar News