పెను సవాళ్లు ఎదుర్కొన్నాను: సమంత
అరుదైన స్వయం ప్రతిరక్షక వ్యాధి మయోసిటిస్ నుండి కోలుకున్నందుకు జీవితంపై కొత్త దృక్పథం వచ్చిందని తెలిపింది.
స్వయంకృషితో తనను తాను ఆవిష్కరించుకున్న స్వీయ నిర్మిత సూపర్‌స్టార్ సమంత. ఇటీవలి లైఫ్ స్టైల్ ఆసియా మ్యాగజైన్ ఇంటర్వ్యూలో కెరీర్ లో సవాళ్ల గురించి సమంత ప్రస్థావించింది. తన ప్రారంభ విజయానికి సవాళ్లు ఎదుర్కొన్నానని, అయితే తాను ఎదుర్కొన్న అణచివేతలు.. తనను మరింత దృఢమైన వ్యక్తిగా మార్చాయని సమంత చెప్పింది. అరుదైన స్వయం ప్రతిరక్షక వ్యాధి మయోసిటిస్ నుండి కోలుకున్నందుకు జీవితంపై కొత్త దృక్పథం వచ్చిందని తెలిపింది.
అమెజాన్ ప్రైమ్ యాక్షన్ సిరీస్ `సిటాడెల్`లో హనీగా అభిమానుల ముందుకు రాబోతోంది. మయోసిటిస్ నుండి కోలుకున్నప్పటికీ చిత్రీకరణలో సవాళ్లను పట్టుదలతో ఎదుర్కొన్నానని తెలిపింది. తన నటనా నైపుణ్యంపై సమంతకు ఉన్న నమ్మకం, తనదైన నటప్రామాణికతతో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలోను తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేసానని వెల్లడించింది.
తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలలో మాతృభాషేతర స్పీకర్‌గా తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఈ సందర్భంగా సమంత ప్రస్థావించింది. తాను చాలా కష్టపడి అంకితభావంతో రెట్టింపు పని చేయడం ద్వారా ఈ అడ్డంకులను అధిగమించానని తెలిపింది. ఈ భాషల్లో పుట్టి పెరిగిన వారితో పోలిస్తే తాను చాలా శ్రమించాల్సొచ్చిందని సామ్ వెల్లడించింది. అది చిన్న సీన్ అయినా పెద్ద సీన్ అయినా తాను ఒకేలా హార్డ్ వర్క్ చేసానని తెలిపింది. స్టార్‌డమ్ దిశగా ప్రయాణించడం.. భాషా సాంస్కృతిక సరిహద్దులను దాటి ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యాలను సాధించడం కోసం అహర్నిశలు తపించానని తెలిపారు.
తనకు తానుగా నిజాయితీగా ఉండడం.. సామాజిక అంచనాలకు లొంగకుండా ముందుకు సాగడంలోని ప్రాముఖ్యతను సమంత ఈ ఇంటర్వ్యూలో నొక్కి చెప్పింది. మైయోసిటిస్‌తో సమంత చేసిన పోరాటం స్వయం ప్రేమ గురించి మరింత అవగాహన కలిగించింది. సమంత ఇతరులను మార్పును స్వీకరించమని .. కొత్త అనుభవాలకు తలుపులు తెరవమని ప్రోత్సహించింది. ఎందుకంటే ఇది వ్యక్తిగత ఎదుగుదలకు అవసరం. శక్తివంతమైన మాట తీరు, ప్రశాంతతతో అభిమానులందరి హృదయాలను సమంత గెలుచుకుంది. ఖుషి చిత్రంలో నటించిన సమంత తదుపరి సిటాడెల్ ప్రమోషన్స్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే కమిటైన తదుపరి చిత్రాల్లో నటించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోందని సమాచారం.