30కోట్లతో సంచలనం.. ఇంతలోనే దర్శకనిర్మాతల వివాదం!
సనమ్ తేరి కసమ్ రీరిలీజ్ లో దాదాపు 30 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది.
హర్షవర్ధన్ రాణే నటించిన 'సనమ్ తేరి కసమ్' రీరిలీజ్‌లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'తుంబాద్' ఆల్ టైమ్ రీరిలీజ్ కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. ఇది నిజంగా ఊహించని విజయం. మొదటి రిలీజ్‌లో అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా రెండో రిలీజ్ లో ఇంత పెద్ద విజయం సాధిస్తుందని కనీసం హీరో కానీ, దర్శకనిర్మాతలు కానీ ఊహించలేదు. సనమ్ తేరి కసమ్ రీరిలీజ్ లో దాదాపు 30 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది.
ఇంతలోనే ఈ సినిమా దర్శకనిర్మాతల మధ్య వివాదం బయటపడటం ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకద్వయం రాధిక రావు- వినయ్ సప్రు సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నామని స్వతంత్రంగా ప్రకటించడంతో చిత్ర నిర్మాత దీపక్ దీనిని వ్యతిరేకించారు. ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించే హక్కులు తమకు మాత్రమే ఉన్నాయని ఆయన అధికారికంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. దర్శకులకు తదుపరి చిత్రాన్ని ప్రకటించే అధికారం లేదని నిర్మాత దీపక్ పేర్కొన్నారు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానిస్తూ.. ''సనమ్ తేరి కసమ్ నిర్మాతను కాబట్టి దాని ఐపీ నాదే. కాబట్టి సీక్వెల్, ప్రీక్వెల్ లేదా రీమేక్ చేసే హక్కులు కూడా నావే. నిజానికి, హర్షవర్ధన్ రాణే హీరోగా సీక్వెల్ గురించి సెప్టెంబర్ 2024లో ప్రకటించాను. దర్శకుల విషయానికొస్తే (రాధిక రావు - వినయ్ సప్రు) నేను వారితో ఎలాంటి చర్చలు జరపలేదు. వారు నన్ను కలిసి దాని గురించి మాట్లాడలేదు. నేను ఏ దర్శకుడిని కూడా ఖరారు చేయలేదు'' అని వెల్లడించారు.
దర్శకులు మిమ్మల్ని సంప్రదించలేదా? అనే ప్రశ్నకు సమాధానంగా దీపక్ ముకుత్ తనను సంప్రదించడం వారి బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా వారు ఇంటర్వ్యూలలో సీక్వెల్ గురించి చర్చిస్తున్నారు గనుక దానికి సంబంధించిన సర్వ హక్కులు తనకు మాత్రమే చెందుతాయని వివరణ ఇచ్చారు. సీక్వెల్ కోసం ప్రస్తుతం రచనా ప్రక్రియ జరుగుతోందని, అది పూర్తయిన తర్వాత నిర్మాణం ప్రారంభమవుతుందని దీపక్ పేర్కొన్నారు.
హర్షవర్ధన్ రాణే - మావ్రా హొకేన్ (పాకిస్తానీ నటి) జంటగా నటించిన 'సనమ్ తేరి కసమ్' రొమాంటిక్ డ్రామా జానర్‌లో తెరకెక్కి, మొదట 2016లో విడుదలైంది. రూ. 14 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 9.1 కోట్లు మాత్రమే వసూలు చేసింది. బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా ఫ్లాప్ అయింది. విషాదకరమైన ముగింపుతో కూడిన ప్రేమకథను ప్రజలు జీర్ణించుకోలేకపోయారని క్రిటిక్స్ విశ్లేషించారు. ఈ చిత్రం 7 ఫిబ్రవరి 2025న థియేటర్లలో తిరిగి విడుదలైంది. ఇప్పటికే రూ.30 కోట్లు వసూలు చేసిఇంది. ఇది ఒరిజినల్ రన్ కంటే మూడు రెట్లు ఎక్కువ వసూలు చేయడం తాజా సంచలనం.