ఆ విషయాలు చెప్పి ఏడవాలనుకోవడం లేదు
అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ వంగా హిందీలో అదే సినిమా రీమేక్ కబీర్ సింగ్ తో ఎంట్రీ ఇచ్చాడు
అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ వంగా హిందీలో అదే సినిమా రీమేక్ కబీర్ సింగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో అక్కడ రెండో సినిమా కే రణబీర్ కపూర్ వంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. రణబీర్ తో యానిమల్ సినిమాను రూపొందించిన సందీప్ వంగ కి బ్లాక్ బస్టర్ హిట్ పడింది.
యానిమల్ సినిమా ఏకంగా రూ.900 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ వంగ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం మరియు అక్కడి మీడియా తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బాలీవుడ్ లో ఉన్న వారు తమ సొంత వారినే ప్రోత్సహించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ప్రతి చోట కూడా తమ వారే ఉండాలి అనుకుంటారు. ఒక వేళ వారికి వ్యతిరేకంగా వెళ్ళాలి అనుకుంటే అత్యంత క్రూరంగా తొక్కేందుకు కూడా వెనుకాడరు. ఈ విషయంలో వారి ప్రవర్తన భయంకరంగా ఉంటుందని సందీప్ అన్నాడు.
ఈ నాలుగు సంవత్సరాల్లో నాకు ఎదురు అయిన అలాంటి పరిస్థితులను చెప్పేందుకు కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. అయితే వాటన్నింటిని చెప్పి ఇప్పుడు చిన్న పిల్లాడి మాదిరిగా నేను ఏడావాలి అనుకోవడం లేదు. వాటిని మర్చి పోయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను ఉన్నట్లు పేర్కొన్నాడు.
ఇక బాలీవుడ్ మీడియా పై కూడా సందీప్ వంగ అసహనం వ్యక్తం చేశాడు. కొందరు దర్శక నిర్మాతల కోసం కొందరు మీడియా వారు పని చేస్తారు. వారు చేసే సినిమాలను ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తే వారు ఇతరులు చేసే సినిమా లపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం నేను చూశాను.
నా సినిమా లో మంచి సన్నివేశాల గురించి కంటే కూడా ఎక్కువగా అభ్యంతరకర సన్నివేశాల గురించి చాలా ఎక్కువగా వారు మాట్లాడారు. యానిమల్ సినిమా కలెక్షన్స్ గురించి వారు కనీసం స్పందించలేదు. సినిమా మూడు గంటలకు పైగా ఉండటంతో మూడు గంటల చిత్ర హింస అంటూ రివ్యూలు ఇచ్చిన వారు కూడా ఉన్నారు అంటూ సందీప్ వంగ పేర్కొన్నాడు.