స్పిరిట్.. సందీప్ వంగాకి అదే అతి పెద్ద సవాల్!
ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో చేరుతుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి.
'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన టాలీవుడ్ హీరో ప్రభాస్.. తన ఇమేజ్ ను నిలబెట్టుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ వస్తున్నారు. వేటికవే ప్రత్యేకమైన జోనర్లలో, ఒకదానితో ఒకటి సంబంధం లేని సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గతేడాది 'సలార్' తో బ్లాక్ బస్టర్ అందుకున్న డార్లింగ్.. లేటెస్టుగా 'కల్కి 2898 ఏడీ' సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో చేరుతుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి. దీంతో ఇప్పుడు ప్రభాస్ తదుపరి చిత్రాల గురించి ఫ్యాన్స్ సర్కిల్స్ లో డిస్కషన్లు జరుగుతున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే భారీ ప్రాజెక్టును ప్రకటించారు. ఇటీవలే హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్ని సినిమాలు కమిటైనా, అభిమానులు మాత్రం సందీప్ వంగా సినిమా కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే 'సలార్', 'కల్కి' వంటి చిత్రాల తర్వాత, 'స్పిరిట్' మూవీతో రికార్డులు తిరగరాయడం ఖాయమని వారంతా నమ్ముతున్నారు.
ఎలాంటి పబ్లిసిటీ లేకుండా 'రాజా సాబ్' ను సెట్స్ మీదకి తీసుకెళ్లిన మారుతి.. సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇదొక రొమాంటిక్ హారర్ ఎంటర్టైనర్ అనే ప్రచారం సాగుతోంది. మరోవైపు 'సీతారామం' దర్శకుడు హనుతో డిఫరెంట్ లవ్ స్టోరీ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇవి రెండూ పాన్ ఇండియా వైడ్ గా డిస్కషన్ జరిగే చిత్రాలు కాదు. ఇద్దరు దర్శకులు గతంలో భారీ చిత్రాలను హ్యాండిల్ చెయ్యలేదు. ఏదొక కంటెంట్ బయటకి వస్తేనే, ఈ సినిమాల చుట్టూ బజ్ క్రియేట్ అవుతుంది. కానీ 'ప్రభాస్ - సందీప్' మూవీ మాత్రం, ఒక్క ప్రకటనతోనే అందరిలో భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ఈ క్రేజీ కాంబో కోసం వేచి చూసేలా చేసింది.
'అర్జున్ రెడ్డి'తో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. 'కబీర్ సింగ్' మూవీతో బాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర సత్తా చాటారు. 'యానిమల్' సినిమాతో రూ. 900 కోట్లకి పైగా కలెక్షన్లు కొల్లగొట్టి, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయారు. మరోవైపు 'కల్కి 2898 AD' సినిమాతో తన సత్తా ఏంటో మరోసారి పాన్ ఇండియాకి చూపించారు ప్రభాస్. హిందీలో 5 రోజుల్లోనే రూ. 128 కోట్ల వరకూ రాబట్టి, నార్త్ లో తన మార్కెట్ ఎంత స్ట్రాంగ్ గా వుందో నిరూపించారు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ - సందీప్ వంగా కలిస్తే హిందీ బెల్ట్‌లో సంచలనాలు సృష్టించడం ఖాయమని అనుకోవచ్చు.
కాకపోతే సందీప్ వంగాకి ఇదంతా అంత ఈజీ కాదు. రెబల్ స్టార్ ప్రభాస్ ను తన సినిమాలో నెక్స్ట్ లెవల్ లో ప్రెజెంట్ చేయడమే దర్శకుడికి అతి పెద్ద సవాల్. విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్ ల విషయంలో ఫ్రీడమ్ తీసుకోగలడు కానీ, ఇక్కడ అలా కాదు. ఎందుకంటే ప్రభాస్ ఆల్రెడీ 'పాన్ ఇండియా స్టార్'గా వెలుగొందుతున్న బాహుబలి హీరో. 'కల్కి'తో బాక్సాఫీస్ వద్ద మరోసారి 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. కాబట్టి సందీప్ రెడ్డి కూడా తప్పకుండా ప్రభాస్‌తో అదే రేంజ్ సినిమా తీయాల్సి ఉంటుంది. అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి.
'యానిమల్'తో వెయ్యి కోట్ల మైల్ స్టోన్ మార్క్ కు దగ్గరగా వచ్చిన సందీప్ వంగా.. ఈసారి 'స్పిరిట్' తో ఆ మార్కును క్రాస్ చేయాలనే టార్గెట్ పెట్టుకొని పని చెయ్యాల్సి ఉంటుంది. ప్రభాస్ ఇమేజ్, స్టార్ డమ్, బాక్సాఫీస్ లెక్కలను దృష్టిలో పెట్టుకుంటూనే.. అంతటి పొటెన్షియల్ ఉన్న స్టోరీని రెడీ చేసుకోవాల్సిన అవసరముంది. యాక్షన్ తో పాటుగా ఎలివేషన్స్, ఎమోషన్స్ ఎక్కడా తగ్గకుండా చూడాలి. వంద శాతం ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసే చిత్రాన్ని అందించాలి. మరి ప్రభాస్ తో సందీప్ ఎలాంటి సినిమా తీస్తాడో వేచి చూడాలి.