ఆ హీరో సలహా విని నటనలోకి రాకపోయి ఉంటే!
అసలింతకీ ఐశ్వర్యారాయ్ కి ఇలాంటి సూచనలు సలహాలు ఇచ్చిన ఆ ప్రబుద్ధుడు ఎవరు? అంటే.. సంజూ అలియాస్ సంజయ్ దత్.
రంగుల మాయా ప్రపంచంలోకి ప్రవేశించాలని కలలు కనే పడతులు ఎందరో. ఈరోజుల్లో కేవలం మెట్రో నగరాల నుంచే కాదు చిన్న పట్టణాల నుంచి కూడా అమ్మాయిలు సినీరంగంలో నటీమణులు కావాలని కలలు కంటున్నారు. అందుకోసం మోడలింగ్, స్టేజీ డ్రామా వంటి వాటిలో సుశిక్షితులై సినీరంగంలో అడుగు పెడుతున్నారు. ఇక్కడ అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని తమను తాము నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇదేదీ చెప్పుకున్నంత సులువు కాదు. ఇక్కడ మోసాలుంటాయి. ఎన్నో వేధింపులను కూడా ఎదుర్కోవాలి. పరిపక్వత లేని కొత్త తరం నటీమణులకు ఈ సమస్యలు మరింత ఎక్కువ.
అయితే ఇలాంటి చాలా విషయాలను మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కి విడమర్చి చెప్పాడు ఒక ప్రముఖ హీరో. తనతో కలిసి ఓ యాడ్ షూట్ కోసం కలిసిన సదరు పాపులర్ హీరో సినీరంగంలో మాయ మర్మం గురించి టాప్ సీక్రెట్స్ అన్నిటినీ వివరంగా చెప్పాడట. కేవలం మోడలింగ్ రంగంలో మాత్రమే కొనసాగాలని, నటనా రంగంలోకి రావొద్దని కూడా హెచ్చరించాడట. తన అందానికి మంత్రముగ్ధుడై, ఆ నీలికళ్లను ఆరాధించాడు. అంతేకాదు... తనలోని అమాయకత్వం ఈ రంగంలోకి వచ్చాక మటుమాయమవుతాయని బాధపడ్డాడు. అందుకే తనను సినీరంగంలోకి రావొద్దని హెచ్చరించాడట.
అసలింతకీ ఐశ్వర్యారాయ్ కి ఇలాంటి సూచనలు సలహాలు ఇచ్చిన ఆ ప్రబుద్ధుడు ఎవరు? అంటే.. సంజూ అలియాస్ సంజయ్ దత్. 1993లో ఐష్ మోడలింగ్ దశలో ఉన్నప్పుడు సంజయ్ దత్ ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం తనను కలిసాడు. ఆ నీలికళ్ల అందానికి అతడు వెంటనే మంత్రముగ్ధుడయ్యాడు. పెప్సీ యాడ్‌లో రాయ్ ఎంత అందంగా ఉందో అంటూ ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో కూడా గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో చిత్ర పరిశ్రమ కష్టాల గురించి వర్ణించి ఐశ్వర్యను దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. స్వచ్ఛంగా, అమాయకంగా ఉంటే సినీరంగంలో తట్టుకోవడం కష్టమని కూడా సూచించాడు.
దత్ చెప్పినవి గుర్తుంచుకున్నా కానీ, మణిరత్నం ఇరువార్ లో అవకాశం అందుకుంది. నెమ్మదిగా సెలక్టివ్ గా తన నటనా వృత్తిని కొనసాగించిన ఐష్ అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఐశ్వర్యారాయ్ అందాన్ని నటనను ఎంతగానో ఆరాధిస్తారు. నిజానికి సంజూ భాయ్ సలహా విని ఐష్ నటనలోకి రాకపోయి ఉంటే కచ్ఛితంగా ప్రజలు ఎంతో కొంత కోల్పోయిన వారు అయ్యేవారు!