సంక్రాంతికి వస్తున్నాం… రమణ గోగుల ఈజ్ బ్యాక్
రమణ గోగుల సాంగ్స్ కి తెలుగునాట ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఒకప్పుడు అతని పాటలు యువతని బాగా ఉర్రూతలూగించాయి.
రమణ గోగుల సాంగ్స్ కి తెలుగునాట ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఒకప్పుడు అతని పాటలు యువతని బాగా ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి రమణ గోగుల ఎక్కువ మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాకుండా పాటలు కూడా పాడారు. అతనికి విశేషమైన క్రేజ్ ఉంది. అయితే రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ గా విరామం తీసుకొని యూఎస్ లో సెటిల్ అయ్యారు.
చాలా కాలంగా అయన సినిమాలకి దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే మరల విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం అతనిని తీసుకొచ్చారు. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. గోదారి గట్టు మీద రామసిలకవే అంటూ సాగే ఈ పాటని రమణ గోగులతో పాడించారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇక భాస్కరపట్ల రాసిన ఈ సాంగ్ ని రమణగోగుల, మధుప్రియ ఆలపించారు.
వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే భార్యాభర్తల డ్యూయెట్ గా ఈ పాట ఉంది. కంప్లీట్ విలేజ్ నేటివిటీ ఉట్టిపడే ఇంట్లో ఈ సాంగ్ ని షూట్ చేశారు. ఈ సాంగ్ తో రమణ గోగుల తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉందనిపిస్తోంది. డిఫరెంట్ స్టైల్ తో చక్కనైన తెలుగు సాహిత్యంతో ఈ పాట ఉండటం విశేషం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ఈ పాట కచ్చితంగా ట్రెండింగ్ లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
అనిల్ రావిపూడి ఈ సాంగ్ కోసం ఏరికోరి రమణ గోగులని తీసుకొచ్చి పాడించారు. దానికి తగ్గ ఫలితం కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నారు. ఇక క్రైమ్ కామెడీ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ లాంటి సక్సెస్ ల తర్వాత హ్యాట్రిక్ మూవీగా ఇది వస్తోంది. ఈ సినిమాని 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు.
ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనిల్ రావిపూడి సినిమాలలో కూడా మంచి కామెడీ ఉంటుంది. దానికి తోడు ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే రాబోతోంది. ఒకప్పటి వెంకటేష్ సూపర్ హిట్ మూవీ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాని గుర్తుచేస్తోంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.