'పుష్ప 2' జేసీబీ కామెంట్స్ ఎఫెక్ట్.. సిద్ధార్థ్ మూవీకి షాక్..?
దీనికి కారణం సిద్ధార్థ్ ఇటీవల 'పుష్ప 2' పై చేసిన కామెంట్స్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బొమ్మరిల్లు సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిస్ యు’. ఎన్.రాజశేఖర్ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ లవ్ డ్రామా తెరకెక్కింది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ చిత్రం ఈరోజు శుక్రవారం తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాకి తమిళనాడులో పాజిటివ్ టాక్ వస్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం సిద్ధార్థ్ ఇటీవల 'పుష్ప 2' పై చేసిన కామెంట్స్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పాట్నాలో గ్రాండ్ గా జరిగిన 'పుష్ప 2: ది రూల్' వైల్డ్ ఫైర్ ఈవెంట్ కు లక్షల్లో జనాలు హాజరైన సంగతి తెలిసిందే. దీనిపై సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాకు, ప్రమోషనల్ ఈవెంట్‌లకు జనాలు రావడానికి సంబంధం లేదన్నారు. ఏ పనులు జరుగుతున్నా చూడడానికి వస్తారని.. ఊర్లలో ఇల్లు కూల్చడానికి జేసీబీ వచ్చినా దాన్ని చూడ్డానికి కూడా జనాలు వస్తారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సిద్ధూని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ ప్రభావమే ఇప్పుడు ‘మిస్ యు’ మూవీపై పడుతోందనే అభిప్రాయ పడుతున్నారు.
'మిస్ యూ' సినిమాకి తెలుగులో టికెట్స్ తెగడం లేదని, థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ బుకింగ్స్ లో నిన్నటి వరకు కేవలం 50 టికెట్లు మాత్రమే బుక్ అయినట్లు వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ లాంటి ధియేటర్ లో జస్ట్ 5 టికెట్లు బుక్కయ్యాయని తెలుస్తోంది. దీంతో సిద్ధార్థ్ సినిమా కోసం జనాలు జేసీబీలలో వస్తున్నారని, పార్కింగ్ ప్లేస్ జేసీబీలతో నిండిపోయిందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
నిజానికి నవంబరు 29వ తేదీనే 'మిస్ యూ' సినిమాని రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. ఆ సమయంలో 'పుష్ప 2' లాంటి పెద్ద సినిమా వస్తుంది కదా.. మీకు ఇబ్బంది కాదా, థియేటర్లు దొరుకుతాయా? అని అడిగితే.. సిద్దార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాకు అలాంటి ప్రాబ్లం ఉండదని, మంచి చిత్రాన్ని ఎవ్వరూ థియేటర్లోంచి తీయలేరని, ఇదేమీ 2006 - 2007 కాలం కాదని, థియేటర్లలో ఇష్టమొచ్చినట్టుగా సినిమాను తీయలేరని, ఇప్పుడు ఆడియెన్స్ అన్నీ చూస్తున్నారని అన్నాడు. కానీ వెంటనే తన సినిమాని వాయిదా వేసుకున్నాడు. ఇదే క్రమంలో 'పుష్ప-2' ఈవెంట్ పై జేసీబీ కామెంట్లు చేశారు.
'మిస్ యూ' ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సిద్ధార్థ్ తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. ‘అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్య ఉందా?’ అని ప్రశ్నించగా.. "నాకు ఎవరితోనూ సమస్యలు లేవు. ‘పుష్ప-2’ మంచి విజయం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. పుష్ప సూపర్ సక్సెస్ అయింది కాబట్టి దాని సీక్వెల్ చూడటానికి ప్రేక్షకులు భారీగా థియేటర్‌లకు వెళ్తున్నారు. ఈవెంట్లకు ఎంతమంది జనాలు వస్తే అంత మంచిది. థియేటర్‌లకు కూడా జనాలు రావాలని ఆశిద్దాం. ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. మేమంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. వంద సినిమాలు రిలీజ్ అయితే ఒకటి మాత్రమే హిట్ అవుతోంది. ఆర్టిస్టులకు వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి" అని సిద్ధార్థ్ అన్నారు.