స్మాల్ స్క్రీన్ టు సిల్వర్ స్క్రీన్.. ఆ నవ్వుల వెనక ఎన్ని కష్టాలో..!
తమిళ పరిశ్రమలో తనకంటూ ఒక మార్కెట్ ఏర్పరచుకుని సొంత టాలెంట్ తో స్టార్ గా ఎదిగిన హీరో శివ కార్తికేయన్. బుల్లితెరతో మొదలు పెట్టి సిల్వర్ స్క్రీన్ పై ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
తమిళ పరిశ్రమలో తనకంటూ ఒక మార్కెట్ ఏర్పరచుకుని సొంత టాలెంట్ తో స్టార్ గా ఎదిగిన హీరో శివ కార్తికేయన్. బుల్లితెరతో మొదలు పెట్టి సిల్వర్ స్క్రీన్ పై ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫైనల్ గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. శివ కార్తికేయన్ అనగానే మన పక్కింటి అబ్బాయే అనిపించేలా అతని నటన, అమాయకత్వం, యాక్షన్ ఇలా అన్ని ఆడియన్స్ కు నచ్చేస్తాయి. ఇప్పుడు ఒక సక్సెస్ ఫుల్ హీరోగా కనిపిస్తున్న అతని వెనక ఎన్నో కష్టాలు అవమానాలు ఉన్నాయి. ఈమధ్య అమరన్ తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శివ కార్తికేయన్ తన గురించి క్లుప్తంగా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తన ఫ్యామిలీ గురించి చెబుతూ.. నాన్న ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఆయన్ను చూసి తాను కూడా ఐపీఎస్ కావాలని అనుకున్నా. చిన్నప్పుడు ఎవరు అడిగినా నేను ఐపీఎస్ అవుతానని చెప్పా.. కానీ ఇంటర్ లో ఒకరోజు కాలేజ్ కి వెళ్తుంటే బై శివ అని చెప్పిన నాన్న సాయంత్రానికి విగత జీవిగా వచ్చారు. నాన్న పోలీస్ అవ్వడం వల్ల చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ గా ఉండేవారు. ఐతే ఆయన అంతిమయాత్ర లో రెండు వేల మందికి పైగా పాల్గొనగా ఆయన చేసిన మేలు గురించి అప్పుడు తెలిసిందని అన్నారు శివ కార్తికేయన్.
నాన్న కాలం చేశాక అమ్మా అక్కా నేను ముగ్గురమే ఆ బాధ అనుభవించాం. అక్క వల్లే ఆ టైం లో కాస్త ఒడ్డుకు పడ్డాం.. తండ్రి లేని లోటు తీర్చింది అక్కే అని అన్నారు. అక్క డాక్టర్ కావాలని అనుకుంది. నాన్న ఉన్నప్పుడే ఎంబీబీఎస్ పరీక్ష రాసింది. ఐతే 3 మార్కుల తేడాతో ఫ్రీ సీట్ రాలేదు. ప్రైవేట్ కాలేజీలో 15 లక్షల దాకా అడిగారు. 15 లక్షలు అప్పు చేసి కట్టేద్దాం అనుకున్నారు. కానీ అక్క తాను వచ్చే ఏడాది మళ్లీ ఎంట్రన్స్ రాస్తానని చెప్పి నాన్నను ఒప్పించింది. అలా చెప్పిన నెక్స్ట్ ఇయర్ ఫ్రీ సీట్ సాధించింది. తర్వాత 6 నెలలకే నాన్న కన్నుమూశారు. ఆ టైం లో అక్క ప్రైవేట్ కాలేజ్ కి వెళ్లుంటే ఆ రుణభారం మా మీద ఉండేదని ఆ టైం లో అక్క మీద భక్తి భయం రెండు ఏర్పడ్డాయి.
ఆ టైం లోనే నువ్వు నాన్నలా పోలీస్ అవ్వొద్దురా.. నిన్ను కూడా కోల్పోలేం అని చెప్పింది. అలా తన లక్ష్యాన్ని మార్చింది అక్కే. ఇంజినీరింగ్ చేయాలని తనే చెప్పింది. ఐతే పెద్దగా చదవని నేను అక్క ప్రోద్బలం వల్లే ఇంజనీరింగ్ చేసేలా చేసిందని శివ కార్తికేయన్ అన్నారు. ఇంజనీరింగ్ ఫీజు కోసం బంధువుల ఇళ్లకు వెళ్తే.. డబ్బులు లేనప్పుడు మీకు ఇంజనీరింగ్ ఎందుకమ్మా అన్న వారు ఉన్నారు. ఎలాగోలా మా మేనమామ అప్పు తెచ్చిస్తే ఇంజనీరింగ్ చేశాను. ఆ టైం లోనే పార్ట్ టైం జాబ్ చేశా. అక్కడ ఉద్యోగం చేస్తున్న టైం లో సరదాగా వేరే వాళ్లను అనుకరించే వాడిని.. అలా ఇంటర్ కాలేజ్ కల్చరల్ లో ప్రైజ్ లు వచ్చాయి. ఐతే ఆ మత్తులో తానుంటే ఇవేవి మనకు అన్నం పెట్టవురా అని అక్క ఆగ్రహం వ్యక్తం చేసేది.
అయినా సరే మిమిక్రీ చేస్తూ స్టార్ విజయ్ లో ఒక షోలో పాల్గొన్నా ఆ షోలో ఫైనల్ లో గెలిచి ఐదు లక్షల రూపాయలు ప్రైజ్ మనీతో ఇంటికి వెళ్తే మళ్లీ అటువైపు వెళ్లను అంటేనే ఈ డబ్బు తీసుకుంటాం అని అక్క అమ్మా చెప్పారు. అలా ఆ మొత్తంతోనే ఎం.బి.ఏ చేశాను. మిమిక్రీ ఆర్టిస్ట్ గా చేసిన తనకు యాంకర్ గా ఆడిషన్ కి వెళ్తే అక్కడ చేదు అనుభవం ఎదురైంది. గొంతులో ఆత్మవిశ్వాసం లేదని అన్నారు. అందుకే యాంకర్ అవ్వాలని అదే ఛానెల్ లో జోడీ డ్యాన్స్ షోలో పాల్గొనా.. జోడీలో క్వార్టర్ ఫైనల్ దాకా చేరి ఆ తర్వాత యాంకర్ గా కూడా సక్సెస్ అయ్యాను. ఆ టైం లో విజయ్ అవార్డులకు హీరో విక్రం వచ్చారు. ఆ మెమెంటో ఒకసారి ఇస్తారా అని అడిగా ఆయన నీ టాలెంట్ కి ఇలాంటివి చాలా వస్తాయ్ అన్నారు.
ఆ తర్వాత హీరో అజిత్ నీ గురించి విన్నా.. నాతో సినిమాకు పని చెయ్ అని అన్నారు. ఐతే పది నిమిషాల పాత్ర అయినా అజిత్ తో చేశానని సంబరపడ్డా కానీ సినిమాలో అది లేకపోయే సరికి బాధపడ్డాను.. ఆ తర్వాత యాంకరింగ్ చేస్తూ మేనమామ కూతురు ఆర్తితో పెళ్లి అయ్యింది.
డైరెక్టర్ పాండిరాజ్ ని ఇంటర్వ్యూ చేయగా.. ఆయనకు నా మేనరిజం నచ్చి మెరినా అనే సినిమా చేస్తున్నా నువ్వే హీరో అన్నారు. అప్పుడు నమ్మలేదు. సినిమా రిలీజ్ అవుతుందో లేదో అని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు. నెల రోజుల షూటింగ్ కి 10000 పారితోషికం ఇచ్చారు. ఇంట్లో వేరే ఉద్యోగంలో చేరా అని కవర్ చేశా.. ఆ సినిమా రిలీజై ఉత్తమ డెబ్యూ యాక్టర్ గా అవార్డ్ వచ్చింది. ఆ తర్వా కామెడీ ఈరోల్లో ఒకరిగా తనకు ఛాన్స్ లు వచ్చాయి. ధనుష్ నిర్మాణంలో వచ్చిన ఎదిర్నీచ్చల్ మంచి సక్సెస్ అయ్యింది. అలా ఒక్కో సినిమా తనకు ఇంత మంచి పేరు తెచ్చి పెట్టాయని అన్నారు శివ కార్తికేయన్.
నాన్న తర్వాత అక్క తన జీవితంలో కీలక పాత్ర పోషించగా ఆ తర్వాత తన స్నేహితులు కూడా కీలక పాత్ర వహించారని అన్నారు శివ కార్తికేయన్. గెలుపు ఓటమి రెండిటిలో వాళ్లు తోడుగా ఉన్నారు. అందుకే వాళ్లకు కూడా తాను అండగా ఉండాలని కామరాజ్ ని డైరెక్టర్ గా చేసి కౌసల్య కృష్ణమూర్తి సినిమా చేశా. నాన్న పేరుతో 25 మంది అనాథలను చదివిస్తున్నా.. ఆ వ్యవహారాలన్నీ ఆర్తీయే చూసుకుంటుందని అన్నారు శివ కార్తికేయన్.