ఒక దక్షిణాది నటుడికి 275 కోట్ల పారితోషికమా?
ఇలయదళపతి విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అతడికి తమిళ బాక్సాఫీస్ వద్ద ఎదురే లేదని నిరూపణ అవుతోంది.
ఇలయదళపతి విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అతడికి తమిళ బాక్సాఫీస్ వద్ద ఎదురే లేదని నిరూపణ అవుతోంది. ఇరుగు పొరుగు భాషల్లో ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినా కానీ, దళపతి విజయ్ నటించిన సినిమాలు తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. అతడు నటించిన ఆరు సినిమాలు వరుసగా 200 కోట్లు అంతకుమించి వసూలు చేసాయి. ఇటీవలే విడుదలైన ది గోట్ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చినా కానీ, ఇది కూడా తమిళ బాక్సాఫీస్ వద్ద 200కోట్ల క్లబ్ ని అందుకుంది. దానికి తగ్గట్టే ఇప్పుడు విజయ్ పారితోషికాలు అందుకుంటున్నాడు. అతడు తన సినిమా కెరీర్ ని ముగించి రాజకీయాల్లోకి వెళ్లేముందు మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దళపతి 69 కోసం ఏకంగా 275 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోబోతున్నట్లు ఇటీవల కథనాలొస్తున్నాయి. ఈ వార్త నిజమైతే, రజనీకాంత్, షారూఖ్ ఖాన్ ల కంటే అతడు అధిక పారితోషికం అందుకుంటున్నట్టు. హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ పారితోషికంలో సగం అందుకునే స్థాయికి ఎదిగాడు. విజయ్ భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే నటుడు ఇప్పుడు.
విజయ్ ఆఖరి చిత్రం దళపతి 69పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ కోసం రాబర్ట్ డౌనీ జూనియర్ జీతం- ఇతర ప్యాకేజీలో సగం పారితోషికాన్ని విజయ్ అందుకుంటున్నాడంటే అర్థం చేసుకోవాలి. నిజానికి రాబర్ట్ డౌనీ జూనియర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్స్‌తో 8 శాతం బ్యాక్ ఎండ్ డీల్‌ని కలిగి ఉన్నాడు. దీనివల్ల అతనికి అవెంజర్స్: ఎండ్‌గేమ్ నుండి మొత్తం 75 మిలియన్ల (630 కోట్లు) ఆదాయం వచ్చింది. కానీ పారితోషికం 275 కోట్ల కంటే తక్కువే. తాజా కథనాల ప్రకారం... తదుపరి అవెంజర్స్ చిత్రాలలో డాక్టర్ డూమ్ పాత్రను పోషించినందుకు రాబర్ట్ డౌనీ జూనియర్‌కు 80 మిలియన్లకు పైగా చెల్లిస్తారని తెలిసింది.
GOAT కోసం విజయ్ పారితోషికం?
ఇటీవలి ఇంటర్వ్యూలో AGS ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత్రి అర్చన కల్పతి `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` కోసం బడ్జెట్ - విజయ్ పారితోషికం వివరాలను అందజేసారు. జీఎస్టీ సహా గోట్ కోసం రూ. 400 కోట్లు ఖర్చు చేశామని ఆమె చెప్పారు. ఈ చిత్రానికి విజయ్ రెమ్యునరేషన్ రూ. 200 కోట్లు అని తెలిపారు. ఒక చిత్రానికి భారీ మొత్తం ఖర్చు చేయడం గురించి, ముఖ్యంగా చిత్రకథానాయకుడు విజయ్ సగం బడ్జెట్‌ను ఇంటికి తీసుకు వెళుతున్నప్పుడు అది ఎలా వర్కవుటవుతుంది? అన్న ప్రశ్నకు సమాధానంగా.. అర్చన మాట్లాడుతూ ``ఒక స్టార్ జీతం వారు సంపాదించగల బాక్సాఫీస్ ఆదాయానికి అనులోమానుపాతంలో ఉంటుంది. మా ప్రొడక్షన్ హౌస్ OTT, శాటిలైట్ , ఇతర భాషా హక్కుల నుండి వచ్చే డబ్బుకు కారణం కాదు. మా వల్ల ఆ ఆదాయం రాదు. హీరోతోనే అది సాధ్యమని అంగీకరించారు. ``సినిమా థియేట్రికల్ రన్ సమయంలో ఖర్చులు, మరిన్నింటిని తిరిగి పొందాలని మేం నమ్ముతాం`` అని తెలిపారు.
తలపతి 69 వివరాల్లోకి వెళితే.. విజయ్ తన రాజకీయ ఆశయం కోసం వందల కోట్ల పారితోషికాన్ని, తన సినీ కెరీర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు నటించే చివరి చిత్రం కోసం బెంగళూరుకు చెందిన డిస్ట్రిబ్యూషన్ హౌస్ KVN ప్రొడక్షన్స్ భారీ పారితోషికం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. విజయ్ పారితోషికం గురించి తెలిసిన తర్వాత ఒక దక్షిణాది నటుడికి 275 కోట్ల పారితోషికమా? అంటూ అందరూ నోరెళ్లబెడుతున్నారు. హాలీవుడ్ హీరోలను తలదన్నేలా అతడు పారితోషికం తీసుకుంటున్నాడంటూ విశ్లేషిస్తున్నారు. షారూఖ్, అమీర్, సల్మాన్ సైతం ఇంత పెద్ద మొత్తాన్ని ఒక పరాయి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎప్పుడూ నేరుగా అందుకోలేదు.