M.S సుబ్బులక్ష్మి అవతారంలో విద్యాబాలన్
పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం.. జీవం పోయడం ఎలానో బాలన్‌కి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదేమో!
పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం.. జీవం పోయడం ఎలానో బాలన్‌కి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదేమో! అందుకే బాలీవుడ్ లో ఎందరు అగ్ర కథానాయికలు ఉన్నా కానీ, పోటీబరిలో తనకు సాటి లేరు ఎవరూ అని నిరూపించింది. తనదైన అసమాన నటప్రతిభతో అన్ని వేళలా ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారీగా అభిమానులను సంపాదించుకుంది. ఇంతకుముందు విజయవాడకు చెందిన తెలుగమ్మాయి, ఐటమ్ క్వీన్ సిల్క్ స్మిత పాత్రలో అద్భుతంగా అభినయించింది. డర్టీపిక్చర్ లో తనదైన నటన, ఎక్స్ ప్రెషన్స్ తో గుబులు రేపింది. సిల్క్ పాత్రకు విద్యాను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేకపోయారు. ఎన్టీఆర్ బయోపిక్ లో సాంప్రదాయబద్ధమైన బసవతారకం పాత్రలో నటించి మెప్పించారు.
ఇప్పుడు భారతరత్న గ్రహీత, ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి గా నటిస్తూ అందరి దృష్టిని బాలన్ తనవైపు తిప్పేసుకున్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 108వ జయంతి సందర్భంగా విద్యాబాలన్ సోమవారం నాడు ఫోటోగ్రాఫిక్ నివాళులర్పించారు. కాస్ట్యూమ్ డిజైనర్ అను పార్థసారథితో కలిసి బాలన్ తన ప్రయోగాత్మక లుక్ ని రివీల్ చేసారు. సుబ్బు లక్ష్మికి సంబంధించిన కొన్ని ఐకానిక్ లుక్‌లను బాలన్‌తో పునఃసృష్టించారు మేకర్స్.
తాజా వైరల్ వీడియోలో సుబ్బులక్ష్మి ధరించిన నాలుగు విభిన్నమైన చీరలలో బాలన్ అలంకరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాంప్రదాయ కుంకుమ, ముక్కు పిన్నులు, మల్లెపూలు, కొండై (బన్) ఉపకరణాలతో బాలన్ తన స్ఫురద్రూపాన్ని తీర్చిదిద్దుకుంది. సుబ్బు లక్ష్మి 108వ జయంతి సందర్భంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూచే `మ్యూజిక్ క్వీన్`గా పిలుపందుకున్న భారత్ రత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి (ఎం.ఎస్.అమ్మ)కి ఫోటోగ్రాఫిక్ నివాళులు అర్పించడం నాకు గౌరవంగా, ఆనందంగా ఉందని రాసారు. సరోజినీ నాయుడు రచించిన `నైటింగేల్ ఆఫ్ ఇండియా` అని బాలన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించారు.
M.S.అమ్మ ధరించిన నాలుగు చీరలను ప్రదర్శించే ఫోటోషూట్ ఇది. 60 & 80 ల మధ్య ప్రజాదరణ పొందిన గెటప్‌లు ఇవి. ఇది M.S.అమ్మ కచేరీ వ్యక్తిత్వం చిత్రణ. M.S.అమ్మ రూపానికి సంపన్నమైన, శక్తివంతమైన రూపాన్ని ఇచ్చినవి ప్రత్యేకమైన చీరలు.. ఇవి ఆమె జీవితంలో ఒక సగం అయితే, మిగిలిన సగం ఆమె నుదుటిపై సంప్రదాయ కుంకుమ.. విభూతి. ఇరువైపులా 2 విలక్షణమైన ముక్కు పిన్నులు .. మల్లిపూలతో అలంకరించిన సాధారణ కొండై(బన్).. ప్రత్యేకమైనవి అని బాలన్ అన్నారు. ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మి మనవరాలు, ప్రముఖ ఫ్లూటిస్ట్ అయిన సిక్కిల్ మాలా చంద్రశేఖర్ ఈ గెటప్పుల కోసం తనకు సహాయం చేసినందుకు బాలన్ కృతజ్ఞతలు తెలిపారు.
భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న , రామన్ మెగసెసే అవార్డును అందుకున్న మొదటి సంగీత విద్వాంసురాలు సుబ్బు లక్ష్మి. ఆమె తల్లి షణ్ముగవడివు శిష్యురాలు. గాయని సుబ్బు లక్ష్మి 10వ ఏట కర్ణాటక సంగీతంలో శిక్షణ ప్రారంభించింది. 1966లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ సంగీత విద్వాంసురాలు కూడా.