హీరో కాకముందు సుధీర్ బాబు అలా చేసేవారా?
టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు.. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన, విలక్షణమైన పాత్రలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు.. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన, విలక్షణమైన పాత్రలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రోల్ కు తగ్గట్టు సిల్వర్ స్క్రీన్ పై కనపడేందుకు పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేస్తుంటారు. చెప్పాలంటే.. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే సుధీర్ బాబు.. హీరో కాకముందు ఏం చేసేవారో తెలుసా?
సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మాళవిక శర్మ హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 14వ తేదీన రిలీజ్ అవ్వనుంది. దీంతో సుధీర్ బాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మూవీపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో తాను హీరో అయ్యే కన్నా ముందు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించానని తెలిపారు.
గుంటూరు, వైజాగ్ ప్రాంతాల్లో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేవాడినని చెప్పారు సుధీర్ బాబు. ఆ మూవీలన్నీ బ్లాక్ బస్టర్లు హిట్లుగా నిలిచాయని వెల్లడించారు. ఆర్య, రణం, అతనొక్కడే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, సై వంటి హిట్ మూవీలను తన స్నేహితులతో కలిసి డిస్ట్రిబ్యూట్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ టైమ్ చాలా సరదాగా గడిచిందని చెప్పారు. యూవీ వంశీ, 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ విజయ్ తన స్నేహితులని చెప్పారు సుధీర్.
"డిస్ట్రిబ్యూషన్ విషయంలో అన్ని వ్యవహారాలు యూవీ వంశీ చూసుకునేవారు. పెట్టుబడులు మాత్రం ముగ్గురు పెట్టేవాళ్ళం. హక్కులతో పాటు ప్రింట్స్ విషయంలో నిర్మాతలతో వంశీ మాట్లాడేవారు. ప్రింట్స్ వచ్చాక మేం తీసుకువెళ్లేవాళ్లం. అప్పుడు మాకు ట్రిప్ లా అనిపించేది. అప్పట్లో తెల్లవారుజామున ప్రింట్స్ మా చేతికి అందేవి. ఏదేమైనా సినిమాల డిస్ట్రిబ్యూషన్ సమయంలో అనేక విషయాలు నేర్చుకున్నాను" అని తెలిపారు సుధీర్ బాబు.
"చెప్పాలంటే తమకు వంద శాతం ట్రాక్ రికార్డు ఉంది. మేము డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా చూసి ఒక్క మూవీ థియేట్రికల్ రైట్స్ కూడా పొందలేదు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆపేశాను" అని సుధీర్ తెలిపారు. ఇక ఏ మాయ చేశావేలో సపోర్టింగ్ రోల్ చేసిన సుధీర్.. శివ మనసులో శృతి సినిమాతో హీరోగా మారారు. ఇప్పుడు హరోం హర మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి మరి.