సుహాస్ గొర్రె పురాణం ఎలా ఉంది..?

ప్రేక్షకుడిని మెప్పించే కథా వస్తువు సినిమాలో ఉంది అంటే చాలు దానిలో మెయిన్ లీడ్ ఎవరన్నది ఆలోచించరు ఆడియన్స్.

Update: 2024-09-22 10:37 GMT

ప్రేక్షకుడిని మెప్పించే కథా వస్తువు సినిమాలో ఉంది అంటే చాలు దానిలో మెయిన్ లీడ్ ఎవరన్నది ఆలోచించరు ఆడియన్స్. కథ ఎవరి చుట్టైతే తిరుగుతుందో వారే ఆ సినిమాలో లేదా ఆ కథలో హీరో అన్నట్టు లెక్క. అందుకే ప్రధాన పాత్ర దారుల ప్రకారంగానే సినిమా టైటిల్ ను కూడా పెడుతుంటారు. అలాంటి ఒక ప్రయత్నమే చేశారు గొర్రె పురాణం డైరెక్టర్ బాబీ. కథ రాసుకున్నప్పుడు బాగుంది అనిపించిన ప్రతీది తెర మీద అంత అందంగా కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఆ కోవలో వచ్చే సినిమానే గొర్రె పురాణం.

ఈ సినిమా టైటిల్ కు తగినట్టుగానే ఒక గొర్రె చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. రఫీక్ బక్రీద్ పండుగ కోసం కొన్న గొర్రె ఇంటి నుంచి తప్పించుకుని ఒక గుడిలోకి వెళ్తుంది. అక్కడ పోచమ్మ తల్లే ఈ గొర్రెని పంపించింది అని నరసింహా ఆ టెంపుల్ లో దాన్ని బలి ఇవ్వాలని అనుకుంటాడు. అలా ఆ గొర్రె మాదంటే మాదని గొడవ పెరుగుతుంది. ఇది కాస్త వైరల్ అయ్యి ఆ గొర్రెను పోలీసులు అరెస్ట్ చేసే దాకా వెళ్తుంది. తీర్పు కోసం కోర్టుకు వెళ్లగా ఆ జడ్జి ఎలాంటి తీర్పు ఇచ్చాడు. జైలులో ఖైదీగా ఉన్న రవి (సుహాస్)కు ఈ గొర్రె కు ఉన్న రిలేషన్ ఏంటి..? రవి అసలు ఎందుకు జైలుకి వెళ్లాడు అన్నది సినిమా కథ.

కథగా రాసుకున్నప్పుడు ఏవైతే హైలెట్ గా అనిపిస్తాయని అనుకున్నారో దర్శకుడు దాన్ని తెర మీద చూపించడంలో అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సినిమా అంతా ఏదో నడిచింది అంటే నడించింది అన్నట్టుగా తీసుకెళ్లాడు. సుహాస్ పాత్ర ఫస్ట్ హాఫ్ లో జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో కొద్దిగా పర్వాలేదు. అతని పాత్ర అతను బాగానే చేశాడు. ఐతే సోలో హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి ట్రాక్ మీద ఉన్న సుహాస్ గొర్రె పురాణం లాంటి సినిమా చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సినిమాలో ఒక గొర్రె ప్రధాన పాత్రధారి కాగా అతను సైడ్ రోల్ చేసినట్టు అనిపిస్తుంది. సినిమాను దర్శకుడు అనుకున్న విధంగా తీయడంలో సక్సెస్ కాలేదు. బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమాను కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయ్యాడని అనిపిస్తుంది. క్లైమాక్స్ లో మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే జరగల్సిన నష్టం జరిగిపోతుంది. గొర్రె పురాణం కథ బాగానే రాసుకున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు.

Tags:    

Similar News