సందీప్ కిష‌న్ హోట‌ల్‌పై రైడ్.. ఇదిగో వివ‌ర‌ణ‌..!

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకున్న యువ‌హీరోల్లో సందీప్ కిష‌న్ ఒక‌రు. హీరోగా వ‌రుస చిత్రాలు చేస్తున్న స‌మ‌యంలోనే అత‌డు వ్యాపారాల్లోను ప్ర‌వేశించాడు

Update: 2024-07-11 04:51 GMT

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకున్న యువ‌హీరోల్లో సందీప్ కిష‌న్ ఒక‌రు. హీరోగా వ‌రుస చిత్రాలు చేస్తున్న స‌మ‌యంలోనే అత‌డు వ్యాపారాల్లోను ప్ర‌వేశించాడు. రెస్టారెంట్ బిజినెస్ తో పాటు సెలూన్ వ్యాపారంలోను సందీప్ కిష‌న్ పెట్టుబ‌డులు పెట్టార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఇప్పుడు సందీప్ కిష‌న్ సొంత రెస్టారెంట్ లో ఆహార భ‌ద్ర‌త క‌రువైంద‌ని క‌స్ట‌మ‌ర్లు ప్ర‌మాదంలో ఉన్నార‌ని సోష‌ల్ మీడియాల్లో తామ‌ర‌తంప‌ర‌గా ప్ర‌చారం సాగుతోంది.

బుధవారం నాడు సికింద్రాబాద్‌లోని 'వివాహ భోజనంబు' అనే రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లో ఆహార భద్రత‌, నాణ్య‌త‌ల‌కు సంబంధించిన‌ తనిఖీలు నిర్వ‌హించారు. ఇది హీరో సందీప్ కిష‌న్ కి చెందిన హోట‌ల్ కావ‌డంతో మీడియా ఫోక‌స్ ఎక్కువైంది. అయితే ఈ త‌నిఖీల్లో కొంత భద్రత, వంట సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని అధికారులు చెప్పిన‌ట్టు సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చార‌మైంది. గడువు ముగిసిన బియ్యం వాడకంపైనా చ‌ర్చ సాగింది.

అయితే మీడియాలో క‌థ‌నాలు వెలువడిన కొన్ని గంటల తర్వాత రెస్టారెంట్ మేనేజింగ్ పార్టనర్‌లలో ఒకరైన నటుడు-వ్యాపారవేత్త సందీప్ కిషన్ త‌మ రెస్టారెంట్ పై త‌ప్పుడు ప్ర‌చారం సాగుతోంద‌ని వ్యాఖ్యానించారు. వంట స‌హా ఆహార‌ భద్రతకు పూర్తిగా సంబంధం లేని కొన్ని చిన్న సమస్యలను మాత్రమే ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు గుర్తించారని ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యలను సత్వరమే పరిష్కరించామని సందీప్ కిష‌న్ తెలిపారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చాలా ఫోటోలు తన వంటగదికి సంబంధించినవి కావని సందీప్ కిషన్ పేర్కొన్నారు. అలాగే ఒక ఫోటోలో గడువు తేదీ లేని బియ్యం సంచిని చూపించారు. ఇది వండేందుకు ఉప‌యోగించేది కాదు. ఇది నాణ్యతను అంచనా వేయడానికి వెండ‌ర్లు ఇచ్చిన బ్యాగ్ ... వంటలో దీనిని ఉపయోగించరు. ఈ విష‌యాన్ని అధికారులే నిర్ధారించారు కూడా'' అని తెలిపారు. హోటల్‌లో ఆహారం రుచిని పెంచే ర‌సాయ‌నాలు, డాల్డా లేదా ఫుడ్ కలర్స్‌ను ఉపయోగించడం లేదని సందీప్‌ కిషన్ పేర్కొన్నాడు. హోట‌ల్ లో నీరు నిల్వ ఉంద‌ని కూడా ఫోటోల్లో ప్ర‌చార‌మైంది. కానీ మేం ప్ర‌తి గంట‌కు ఒకసారి పీక్ అవ‌ర్ త‌ర్వాత హైజీనిక్ కోసం హోట‌ల్ లోప‌ల క్లీన్ చేస్తుంటామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. దీనికి సంబంధించి సందీప్ కిష‌న్ రాసిన సుదీర్ఘ నోట్ ఎక్స్ ఖాతాలో వైర‌ల్ గా మారింది.

Tags:    

Similar News