ఒకే ఒక్క బ్లాక్ బస్టర్‌తో 100 కోట్ల డీల్?
ఇక సీనియర్ డియోల్ తిరిగి వస్తాడో రాడో అనుకున్న సమయంలో ఈ అనూహ్య పరిణామం ఎవరూ ఊహించనిది.
ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ లైఫ్ ని ఎలా టర్న్ చేస్తుందో ఇటీవల 'విక్రమ్' మూవీతో కమల్ హాసన్ చూసారు. ఇప్పుడు 'గదర్ 2'తో సన్నీడియోల్ అలాంటి సన్నివేశాన్ని చూస్తున్నారు. ఆ ఇద్దరు సీనియర్ హీరోలు ఇప్పుడు కెరీర్ పరంగా దిల్ ఖుష్.. వరుస సినిమాలతో కెరీర్ పరంగా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. ఒక్కో ఎంపికకు కోట్లాది రూపాయల ప్యాకేజీలు అందుకుంటున్నారు ఈ సీనియర్లు. ఈ దెబ్బకు ఇన్నాళ్లుగా చేసిన అప్పులన్నీ తీర్చేస్తున్నారు. అమ్మేసిన ఆస్తుల్ని తిరిగి సొంతం చేసుకుంటున్నారు.
భారీగా అకౌంట్లో నిల్వల్ని పెంచుకుంటున్నారు. కమల్ హాసన్ వరసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ సోలో భారీ ప్యాకేజీలు అందుకుంటున్నారు. ఆయన నిర్మాతగాను సినిమాలు తీస్తున్నారు. అగ్రదర్శకులతో కలిసి పని చేసేందుకు భారీ ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అదే తీరుగా సన్నీడియోల్ కూడా బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలకు సంతకాలు చేస్తున్నారు.
ఇక సీనియర్ డియోల్ తిరిగి వస్తాడో రాడో అనుకున్న సమయంలో ఈ అనూహ్య పరిణామం ఎవరూ ఊహించనిది. ఇంతకుముందే సన్నీడియోల్ తన సహచర నటుడు, నిర్మాత అయిన అమీర్ ఖాన్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ తో సన్నీడియోల్ భారీ ప్యాకేజీని అందుకోనున్నాడు. ఇంతలోనే సన్నీడియోల్ ఇప్పుడు టీసిరీస్ భూషణ్ కుమార్‌తో కలిసి జెపి దత్తా నిర్మిస్తున్న బోర్డర్ సీక్వెల్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బోర్డర్ 2 కోసం సన్నీ డియోల్ ఇటీవల మెగా డీల్ మాట్లాడుకున్నారని తెలిసింది.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, సన్నీ డియోల్ రూ. 50 కోట్ల ప్యాకేజీకి లాక్ అయ్యారు. ముందస్తు రుసుము రూ. 50 కోట్లు పక్కన పెడితే, నిర్మాతలు ఆర్జించే లాభాల నుండి కొంత వాటాను పొందే బ్యాక్ ఎండ్ డీల్‌ను కూడా సన్నీ కుదుర్చుకున్నారని సమాచారం. ''నిజానికి సీనియర్ నటుడు సన్నీ దీనికి అర్హుడు. ఎందుకంటే అతడు నటించిన 'బోర్డర్' అప్పట్లో సంచలన విజయం సాధించింది. నిర్మాతలకు భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. ఈ సినిమా సీక్వెల్ కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదు.. సన్నీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉంది'' అని నిర్మాతలు పేర్కొన్నట్టు తెలిసింది.
సన్నీ డియోల్ 2024 ద్వితీయార్థంలో బోర్డర్ 2 షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రంలో అతిపెద్ద వార్ ఫిల్మ్‌ని సన్నీ డియోల్ తో చేసేందుకు నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ ఫిల్మ్‌కు సంబంధించిన పనిని ప్రారంభించాల్సిందిగా, మేకోవర్ కోసం ప్రయత్నించాల్సిందిగా సన్నీడియోల్‌ని నిర్మాణ సంస్థ కోరిందని తెలిసింది.
డియోల్‌తో పాటు ఆయుష్మాన్ ఖురానా, అమ్మీ విర్క్, అహన్ శెట్టి ఇందులో నటిస్తారని సమాచారం. ప్రస్తుతానికి బోర్డర్ 2 డైరెక్టర్ ఎవరనేది గోప్యంగా ఉంచారు. రెండు వరుస డీల్స్ తో సన్నీడియోల్ ఏకంగా 100 కోట్ల వరకూ అందుకుంటున్నాడని, లాభాల్లో వాటాలు అదనం అని కూడా చర్చ సాగుతోంది.