సూర్య బ్రదర్స్ తో జ్యోతిక సాయంగా 50 లక్షలు
గతంలో ఉత్తరాఖండ వరదల సమయంలో సౌత్ హీరోలు భారీగా విరాళాలు ఇచ్చారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తూ ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో మందిని చదివిస్తున్నారు. సూర్య తమ్ముడు హీరో కార్తీ కూడా సోషల్ యాక్టివిటీస్ లో ముందుంటారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు మన సౌత్ స్టార్స్ అందరూ కూడా వారికి తోచినంత విరాళంగా ఇస్తూ ఉంటారు. గతంలో ఉత్తరాఖండ వరదల సమయంలో సౌత్ హీరోలు భారీగా విరాళాలు ఇచ్చారు. అవకాశం దొరికిన ప్రతిసారి వారి గొప్ప మనసు చాటుకుంటారు.
ఇదిలా ఉంటే కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడి ఒక గ్రామం పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఎన్నడూ లేనంత భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడటంతో పాటు పెద్దస్థాయిలో బురద గ్రామంలోకి వచ్చి ప్రజలని ముంచేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 250+ మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. గల్లంతయిన వారి ఆచూకీ ఇంకా లభించలేదు. NDRF, ఇండియన్ ఆర్మీ, ఫైర్ సిబ్బంది పెద్దఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని, శిథిలాల క్రింద ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి శవాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే విపత్తు ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. శిథిలాలు పూర్తిగా తొలగిస్తే భారీస్థాయిలో మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ విపత్తులో వేలమంది ప్రజలు పూర్తిగా నిరాశ్రయులుగా మారారు. కుటుంబ సభ్యులని పోగొట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు.
అతికష్టం మీద బ్రతికిబయటపడిన నిలువనీడలేదు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగూ ముందుకి వస్తాయి. అలాగే చాలా మంది లక్షల నుంచి కోట్ల రూపాయిలు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ అదానీ వాయనాడ్ నిరాశ్రయుల కోసం భారీ స్థాయిలో విరాళం ప్రకటించారు. తాజాగా సూర్య, జ్యోతిక, కార్తీ వాయనాడ్ నిరాశ్రయుల కోసం 50 లక్షల విరాళం ప్రకటించారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి వీరే ముందుకొచ్చి మొదటిగా సాయం ప్రకటించారు. వీరి దారిలో మరికొంతమంది కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ కి సూర్య, జ్యోతిక, కార్తీ తమ విరాళాన్ని అందించారు. మృతుల కుటుంబాలకి తమ సానుభూతి తెలియజేశారు.