ఇండస్ట్రీకి గుడ్ న్యూస్... ఎట్టకేలకు అతడు అరెస్ట్
సినిమాలను ఎక్కువగా పైరసీ చేస్తున్న వారిలో తమిళ్ రాకర్స్ ముందు ఉంటుంది.
గత రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి అత్యంత పెద్ద తలనొప్పిగా మారిన విషయం పైరసీ. ఈ పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సినిమాలు గతంలో మాదిరిగా 50 రోజులు, 100 రోజులు ఆడే పరిస్థితి లేదు. వారం రెండు వారాల్లోనే సినిమాలు థియేటర్ ల నుంచి వెళ్లి పోతున్నాయి.
మొదటి వారం లోపే పైరసీ లు ఆన్ లైన్ లో వస్తున్నాయి. దాంతో సాధ్యం అయినంత వరకు ఎక్కువ వసూళ్లు రెండు వారాల్లో రాబట్టుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాలను ఎక్కువగా పైరసీ చేస్తున్న వారిలో తమిళ్ రాకర్స్ ముందు ఉంటుంది. నిర్మాతలకు ఛాలెంజ్ విసిరి మరీ సినిమాలను పైరసీ చేస్తూ వచ్చారు.
తమిళ్ రాకర్స్ అడ్మిన్ ను అరెస్ట్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విఫలం అయ్యాయి. అతడు ఎక్కడ నుంచి సినిమాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్నాడు అనే విషయాలను పోలీసులు కనిపెట్టినా కూడా అరెస్ట్ చేయడం మాత్రం సాధ్యం కాలేదు.
ఎట్టకేలకు తమిళ్ రాకర్స్ అడ్మిన్ జెఫ్ స్టీఫన్ రాజ్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ధనుష్ మూవీ రాయన్ ను తిరువనంతపురంలోని ఒక థియేటర్ లో మొబైల్ ద్వారా రికార్డ్ చేస్తున్న సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా జెఫ్ స్టీఫన్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల మలయాళ స్టార్ పృథ్వీరాజ్ నటించిన గురువాయూర్ అంబలనడయిల్ సినిమాను రిలీజ్ రోజే పైరసీ చేసి తమిళ్ రాకర్స్ లో ఉంచడం జరిగింది. దాంతో పృథ్వీరాజ్ భార్య పోలీసులకు తమిళ్ రాకర్స్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు స్టీఫన్ రాజ్ ను అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. అతడి అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.