నాలాంటోళ్లకు ఓటీటీ వాళ్లు తలుపులు మూసేశారు

ఈ చిత్ర విడుదల నేపథ్యంలో తనికెళ్ల భరణి మీడియాతో మాట్లాడారు. పలు ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.

Update: 2023-09-17 04:29 GMT

తెలుగు సినిమా రంగంలో అత్యద్భుతమైన టాలెంట్ ఉన్న వారిలో ఒకరు తనికెళ్ల భరణి.. నటుడిగా మాత్రమే కాదు.. ఒక కవిగా.. ఒక దర్శకుడిగా.. ఒక రచయితగా.. ఇలా చెప్పుంటూ పోతే ఆయనకున్న టాలెంట్ జాబితా పెద్దగా మారుతుంది. ఈ నెలాఖరులో విడుదల కానున్న పెదకాపు-1 మూవీలో తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర విడుదల నేపథ్యంలో తనికెళ్ల భరణి మీడియాతో మాట్లాడారు. పలు ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. ఒకే తరహా పాత్రల్ని పోషించి బోర్ కొట్టిందన్న ఆయన.. ఈ ఏడాదిలో ఒకేలాంటి మూసపాత్రలతో విరక్తి చెంది. పద్దెనిమిది పాత్రల్ని వదులుకున్నట్లు చెప్పారు.

మాంచి కామెడీ పాత్రలో.. విలన్ పాత్రలో ఇవ్వొచ్చు కదా? అని దర్శకుల్ని తాను అడుగుతుంటానని.. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి పాత్రల్లో పెదకాపు-1 ఒకటన్నారు. గడిచిన రెండు.. మూడేళ్లలో తాను పోషించిన అత్యుత్తమ పాత్ర ఇదేనంటూ కితాబునిచ్చారు. సాధారణంగా దర్శకుడు ఏ ప్రాంతానికి చెందిన వాడైతే.. ఆ ప్రాంతానికి చెందిన నేటివిటీ వారి సినిమాల్లో కనిపిస్తుందని.. కానీ శ్రీకాంత అడ్డాల మాత్రం పెదకాపు మూవీలో తనకు సంబంధం లేని దర్శకుడ్ని బయటకు తీసుకొచ్చారంటూ వ్యాఖ్యానించారు.

ఈ సినిమాలో ప్రతీకారాన్ని తీవ్రస్థాయిలో చూపించినట్లుగా చెప్పిన తనికెళ్ల భరణి.. ఈ మూవీలో హీరో విరాట్ కర్ణ కొత్తల్లో కాస్త బెరుగ్గా కనిపించాడు కానీ.. ఆ తర్వాత సులువుగా నటించారన్నారు. చిత్రనిర్మాత అఖండ సినిమాను ఎంత భారీగా చేశారో.. అదే స్థాయిలో ఈ సినిమాను చేశారన్నారు.

తాను నటించే సినిమాల సందర్భంగా దర్శకులతో తనకు మూడు రకాలైన అనుభవాలు ఎదురవుతాయన్న ఆయన.. తాము సిద్దం చేసిన సంభాషణల్ని మార్చటానికి ససేమిరా అనే వారు ఒకరైతే.. సెట్లో పెన్ను.. పేపరు చేతికిచ్చి సర్.. మీ పాత్రని మీరే రాయండని అంటారన్నారు. మూడో రకం వారైతే.. ఈ మాట కూడా రాస్తే బాగుంటుందంటూసూచనలు చేసే వారుంటారని చెప్పారు.

తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో తాను చేయాలనుకున్న మిథునం మూవీని చేశానని.. ఇంకో సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీయాలనే ఆలోచన ఉందన్నారు. దర్శకుడిగా తాను సినిమా చేసి పదేళ్లు అయ్యిందని.. కథలు లేక కాదని.. వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేయలేనని చెప్పారు. తనలాంటి వారికి ఓటీటీ వారు తలుపులు మూసేశారన్న ఆయన.. హింస.. అసభ్యత కనిపించాలని కోరుకుంటున్నారని.. వాళ్లకు కావాల్సిన కంటెంట్ సప్లై చేయాలని వారంటారంటూ ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా ఓపెన్ గా చెప్పేయటం గమనార్హం.

Tags:    

Similar News