ఉడిపి శ్రీకృష్ణ మఠానికి తారక్ ఎందుకు వెళ్లాడు?
ఎన్టీఆర్ తో పాటు ఈ సందర్శనంలో కన్నడ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్, కాంతార ఫేం, ఆల్ రౌండర్ రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.
అవును.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అచ్చ తెలుగు కుర్రాడే .. కాదని అనడం లేదు! కానీ అతడి మూలాలు కర్నాటకలోను ఉన్నాయి. తన తల్లి, అమ్మమ్మగారి స్వగ్రామం కర్నాటక ఉడిపిలోని 'కుందాపురం'. తండ్రి గారు దివంగత హరికృష్ణ స్వస్థలం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎన్టీఆర్ మూలాల ప్రస్థావన దేనికి? అంటే సందర్భం వచ్చింది. అతడు తన తల్లిగారి స్వస్థలం కుందాపురానికి వెళ్లారు. అక్కడ మహిమాన్విత లార్డ్ శ్రీకృష్ణుని మఠాన్ని సందర్శించాడు. అది కూడా తన తల్లి షాలినీ పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందే అక్కడికి చేరుకుని భార్య లక్ష్మీ ప్రణతి, షాలినితో కలిసి దేవాదిదేవుని దర్శించుకున్నారు. ఇది తనకు చెప్పలేని ఆనందాన్నిచ్చిందని తారక్ మాటల్ని బట్టి అర్థమవుతోంది.
ఎన్టీఆర్ తో పాటు ఈ సందర్శనంలో కన్నడ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్, కాంతార ఫేం, ఆల్ రౌండర్ రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. X లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఉడిపిలోని శ్రీ కృష్ణ మఠం ఆలయంలో జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి, భార్యతో కలిసి ప్రార్థనలు చేస్తున్నప్పుడు రిషబ్ శెట్టి నేపథ్యంలో కనిపించాడు.
నన్ను తన స్వస్థలం కుందాపురానికి తీసుకురావాలని, ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలనే మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది! సెప్టెంబరు 2న అమ్మ పుట్టినరోజుకు ముందు తాను కోరుకున్న దర్శనం జరిగేలా చేయడం నేను తనకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి. నిర్మాత కిరంగదూర్ సర్.. నా ప్రియమైన స్నేహితుడు ప్రశాంత్ నీల్‌కి ధన్యవాదాలు.. నాతో చేరి దీన్ని సాధ్యం చేసినందుకు'' అని రాసారు. నా ప్రియమైన స్నేహితుడు రిషబ్ కి ప్రత్యేక ధన్యవాదాలు. అతడి రాక ఈ క్షణాన్ని చాలా ప్రత్యేకంగా చేసింది అని ఆనందం వ్యక్తం చేసాడు తారక్.
NTR నటించిన 'దేవర: పార్ట్ 1' కొత్త పోస్టర్‌ను ఇటీవల ఆవిష్కరించగా దానికి మంచి స్పందన వచ్చింది. పోస్టర్‌లో ఎన్టీఆర్ జూనియర్ డబుల్ ముఖాలు.. సీరియస్ ఇంటెన్స్ లుక్ ప్రత్యేక వైబ్‌ను క్రియేట్ చేసాయి. ''సెప్టెంబర్ 27న థియేటర్లలో దేవర1 ని వీక్షించి అతడి గంభీరమైన పిచ్చిని అనుభవిద్దాం'' అని మేకర్స్ టీజ్ చేసారు. మరో 27 రోజుల్లో అభిమానులు, సాధారణ సినీవీక్షకులు దేవరను థియేటర్లలో వీక్షించే వీలుంది.