గద్దర్ అవార్డులు.. తెలంగాణ సినిమా వృద్ధికి తొలి మెట్టు!- ఫిలింఛాంబర్
తెలంగాణ ప్రభుత్వం అవార్డులను పునరుద్ధరించడం సినిమా అభివృద్ధికి సూచిక అని గౌరవ కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు.;
సినిమా లెజెండ్ ఎన్టీఆర్, సినీ దిగ్గజాలు పైడి జైరాజ్, టి కాంతారావులను సత్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో నగరంలో జరగనున్న `గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం`లో వారి పేరు మీద రెండు ప్రత్యేక అవార్డులను ప్రదానం చేస్తుంది. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డ్, పైడి జయరాజ్ చలనచిత్ర అవార్డ్, బిఎన్ రెడ్డి చలనచిత్ర అవార్డ్, నాగిరెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డ్, కాంతారావు చలనచిత్ర అవార్డ్, రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డ్ లను గద్దర్ అవార్డుల్లో అందజేస్తారని తాజాగా ఫిలింఛాంబర్ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజుకు ఈ సందర్భంగా ఫిలింఛాంబర్ కృతజ్ఞతలు తెలియజేసింది. తెలంగాణ ప్రభుత్వం అవార్డులను పునరుద్ధరించడం సినిమా అభివృద్ధికి సూచిక అని గౌరవ కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహించనున్న అవార్డులు ఇవి. తొలి అధికారిక తెలంగాణ ప్రభుత్వ అవార్డులుగా ఇవి గుర్తింపు పొందుతాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన నంది అవార్డులను కొన్ని చిన్న మార్పులు మినహా ప్రదానం చేస్తారు. ఉర్దూ సినిమాను గుర్తించడానికి ఉత్తమ చిత్ర అవార్డును కూడా ప్రదానం చేయనున్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అంటే.. 2014 (జూన్ తర్వాత విడుదలైంది) నుండి 2023 వరకు అన్ని సంవత్సరాలకు ఉత్తమ సినిమా అవార్డును ప్రదానం చేయనున్నామని గతంలో ఎఫ్.డి.సి కర్త దిల్ రాజు గతంలో తెలిపారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి, రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధ చిత్ర దర్శకుడు & నిర్మాత బి. నర్సింగ్ రావును చైర్మన్‌గా నియమించింది. ప్రతి విభాగంలోనూ చిత్రాలను ఎంపిక చేయడానికి జ్యూరీ పని చేస్తుంది.