తెలుగులో డబ్బింగ్ హవా.. 50కోట్ల సినిమాలివే!
బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా తెలుగులో హిట్ టాక్ సంపాదించుకుని వసూళ్ల వర్షం కురిపించాయి.
తెలుగులో డబ్బింగ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమిళ హీరోల సినిమాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారు. అక్కడి సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విజయ్ లాంటి హీరోలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. వారి సినిమాలు చాలా వరకు టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా తెలుగులో హిట్ టాక్ సంపాదించుకుని వసూళ్ల వర్షం కురిపించాయి.
అయితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా రాబట్టిన డబ్బింగ్ సినిమాలు ఏవో తెలుసా?.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అయితే రజనీ సూపర్ హిట్ మూవీ రోబో.. తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఆ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన రోబో 2.0 కూడా 2018లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఈ రెండింటికి మధ్యలో విక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీ ఐ మనోహరుడు.. 2018లో సూపర్ హిట్ టాక్ సంపాదించి 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత కొవిడ్ మహమ్మారి విజృంభించడంతో సినిమా రిలీజ్ లు, వసూళ్ల వర్షాలు తగ్గాయి. పోస్ట్ పాండమిక్ ప్రపంచంలో మళ్లీ ఊపందుకున్నాయి. కన్నడ స్టార్ యశ్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.50 కోట్ల గ్రాస్ మైలు రాయిని అందుకుంది.
అదే ఏడాది మరో కన్నడ మూవీ కాంతారకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనేక రోజుల పాటు ఈ సినిమాకు అభిమానులు క్యూ కట్టారు. రూ.50కోట్ల వసూళ్లను అందించారు. హాలీవుడ్ మూవీ అవతార్-2 కూడా భారీగా వసూళ్లు సాధించింది. 2023లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షమే అని చెప్పొచ్చు. అటు ఉత్తరాదిలో.. ఇటు దక్షిణాదిలో అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
రజనీకాంత్ నటించిన జైలర్ తెలుగు నాట.. రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మిల్కీ బ్యూటీ తమన్నా, నటులు మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌లు కీలక పాత్రల్లో అలరించారు. రజినీ థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు రాబట్టింది. తాజాగా రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ కూడా తెలుగులో భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. 100 కోట్లు పక్కాగా వసూలు చేస్తుందని ట్రాడ్ వర్గాల్లో టాక్ వినిపిసోంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయన యానిమల్ సినిమా హక్కులను కేవలం 15 కోట్లకు కొనుగోలు చేసి మంచి ప్రాఫిట్స్ సొంతం చేసుకుంటున్నారు.