థియేటర్ల బంద్‌తో ఎలాంటి సంబంధం లేదు: TFPC
రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు, లేదా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసే బాడీలు ఇవి అని TFPC అధికారిక ప్రకటనలో పేర్కొంది
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్లను మూసివేయాలని ఒక సంఘం నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి అపెక్స్ బాడీస్‌కు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ నుండి సినిమా థియేటర్ యజమానుల సమూహం లేదా ఏ ఇతర అసోసియేషన్ ఎటువంటి నోటీసు ఇవ్వలేదని తెలియజేస్తున్నాం. అందుకే థియేటర్ల బంద్ ఫేక్ ప్రచారం.
తక్కువ రాబడి కారణంగా థియేటర్లను మూసివేసిన కొందరు థియేటర్ యజమానుల వ్యక్తిగత నిర్ణయం మాత్రమే ఇది. దీనికి సంబంధించి అపెక్స్ బాడీలు అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు థియేటర్ల మూతతో ఎలాంటి సంబంధం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు, లేదా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసే బాడీలు ఇవి అని TFPC అధికారిక ప్రకటనలో పేర్కొంది.
సరైన సినిమాల్లేక డైలమా:
సరైన కలెక్షన్లు లేక ఒక్కో షోకు కనీసం రూ.5000 నష్టపోతున్నామని కొందరు ఎగ్జిబిటర్లు ప్రకటించడం సంచలనమైన సంగతి తెలిసిందే. దీనివల్ల తెలంగాణలోని అనేక సింగిల్ స్క్రీన్ యజమానులు తమ థియేటర్‌లను మూసివేశారు. వచ్చే 10-15 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తారని వార్తలు వచ్చాయి.
జనం లేక వెలవెలబోతున్నందున మే 17 నుంచి మే 26 వరకు పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ లను మూసివేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ (టీటీఏ) బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న పట్టణాల్లో సగటు సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్వహణ ఖర్చు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ఉంటుందని, హైదరాబాద్‌లో రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఉంటుందని తెలిపారు. అయితే చాలా థియేటర్లలో రోజుకు రూ. 4,000 కూడా రాబట్టడం లేదు. చిన్న సినిమాల వసూళ్లు మరింత పడిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ఇటీవలి కాలంలో సమీప భవిష్యత్తులో చెప్పుకోదగ్గ విడుదలలు లేకపోవడంతో, మేము థియేటర్లను తాత్కాలికంగా మూసివేసే తీవ్రమైన చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాము అని ఒక ప్రకటనలో తెలిపారు. థియేటర్ యజమానులు నిర్మాతల నుండి నేరుగా చెల్లింపులు డిమాండ్ చేస్తున్నారు.. నిర్మాతలు తమ సినిమాలను ప్రదర్శించడానికి థియేటర్ యాజమాన్యానికి నేరుగా చెల్లించినట్లయితే థియేటర్ యజమానులు సినిమాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.