'తండేల్'.. మెగా ప్రొడ్యూసర్ మాస్టర్ ప్లాన్!

ఈ డేట్ ను లాక్ చేయడం వెనకున్న అసలు విషయాన్ని అల్లు అరవింద్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

Update: 2024-11-05 17:45 GMT

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా 'తండేల్'. ఇందులో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. లేటెస్టుగా ఈ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. వాలెంటైన్స్ వీక్‌ ప్రారంభానికి ముందు, 2025 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ డేట్ ను లాక్ చేయడం వెనకున్న అసలు విషయాన్ని అల్లు అరవింద్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''తండేల్ రిలీజ్ డేట్ గురించి మూడు వారాల నుంచి జనాల్లో సందడి జరుగుతోంది. మేము చెప్పకుండానే సంక్రాంతికి వస్తున్నామని చాలామంది డిసైడ్ చేసుకున్నారు. అందరూ సినిమా 'పండక్కి అంట' కదా అని అడుగుతుంటే మాకు చిన్న టెన్షన్ వచ్చేసింది. వాస్తవానికి సినిమాని డిసెంబర్ 20న తీసుకురావాలని అనుకున్నాం. కానీ రెండు కారణాల వాళ్ల రిలీజ్ చేయలేకపోతున్నాం. జనవరి 14న రావాలని నిజంగా అనుకోలేదు. ఎందుకంటే ఆ టైములో వచ్చే సినిమాలకి అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. పండక్కి ఎంత పెద్ద సినిమాలు వచ్చినా ఆ ఈక్వేషన్స్ పాటించాల్సి ఉంటుంది'' అని అన్నారు.

''రిలీజ్ డేట్ చెప్పడానికి ఇంత పెద్ద ఈవెంట్ లా చేయడం ఎందుకు? అని మీరంతా అనుకోవచ్చు. గీతా ఆర్ట్స్ ఏదైనా మొదటిసారి చేయడానికి ప్రయత్నిస్తుంది. 'సరైనోడు' సినిమాకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఫస్ట్ టైం చేసాం. 'జల్సా' సినిమాకి మ్యూజిక్ ఫెస్టివల్ ను చేసాం. అలానే తండేల్ రిలీజ్ డేట్ ను ప్రత్యేకంగా చెప్పాలని అనుకున్నాం. రిలీజ్ డేట్ ప్రజల గుండెల్లోకి వెళ్లాలంటే, దాన్ని మీ అందరి సమక్షంలో ఒక పండుగలా చెప్పాలని ఇప్పుడు ఈ వేడుక చేస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్ చెప్పమని బన్నీ వాసు అడిగితే.. 'ఫస్టాఫ్ చూసాను, సెకండాఫ్ కూడా చూసిన తర్వాత చెప్తాన'ని అన్నాను. అప్పటివరకు డేట్ చెప్పకూడదని అనుకున్నాను. రెండు రోజుల క్రితం సెకండాఫ్ చూసిన వెంటనే డేట్ పెట్టేద్దామని చెప్పాను''

''ఒక సినిమాకి బెస్ట్ రిలీజ్ డేట్ ఏమిటని డైరెక్టర్ చందు నన్ను అడిగారు. 'సినిమా పెద్దగా పోటీ లేకుండా ఒంటరిగా రావాలి. నెలాఖరున జీతాలు అన్నీ అయిపోయిన తర్వాత మంచి ఓపెనింగ్స్ రావాలంటే కష్టం. అందుకే ఫస్ట్ వీక్ లో అయితే బాగుంటుంది. అలాగే సినిమాలో ఏముందో అనే ఉత్సుకత తీసుకురాగలిగిన మెటీరియల్ మన దగ్గర ఉంటే, దాన్ని ప్రమోట్ చేసి ప్రాపర్ గా ప్రజల ముందు పెట్టాలి. ఈ సినిమా చూడాలంటే ఎగ్జైట్మెంట్ కలిగించాలి. ఇవన్నీ 25% మాత్రమే. మిగతా 75% సినిమా బాగుండాలి. ఈరోజుల్లో ఓపెనింగ్ 40 శాతం ఉంటే, ఫస్ట్ షోకి 110 శాతం ఉంటోంది. మౌత్ టాక్ అంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది. కాబట్టి సినిమా బాగుండాలి. బాగున్న సినిమా మన దగ్గర వుంది. దాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తే.. ఫిబ్రవరి 14 ఇంపార్టెన్స్ మీకు తెలుసు కదా. అక్కడికి పీక్ లో ఉంటుంది. ఆ డేట్ కి వేద్దామ'ని చెప్పాను'' అని అల్లు అరవింద్ తెలిపారు.

అనంతరం మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు అల్లు అరవింద్ సమాధానమిచ్చారు. పొంగల్ సీజన్ ను మిస్ చేసుకోవడంపై స్పందిస్తూ.. ''నిజంగా అవకాశం ఉన్నప్పుడు సంక్రాతికి రావాలనే ఉత్సాహం అందరికీ ఉంటుంది. పండక్కి వస్తే బాగుండు అని నాకు కూడా ఉంది. ఇటీవలి పరిణామాలను బట్టి, మారుతున్న అభిరుచులను బట్టి, రిలీజ్ కు ముందు ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నాం. సంక్రాంతికి నాలుగు సినిమాలున్నాయి. అందులో మూడు పెద్ద సినిమాలు కనబడుతున్నాయి. సంక్రాంతికి ఒకే ఫ్యామిలీ నుంచి రెండు సినిమాలు వేసుకోవచ్చు అనేది ఉంది''

''సంక్రాంతికి ఆ సినిమాలకు థియేటర్లు షేర్‌ అవుతాయి. ఎక్కువ థియేటర్లలో వేయ్యలేం. ఈరోజుల్లో పెద్ద సినిమాకి ఫస్ట్ వీక్ చాలా ముఖ్యం. కానీ తండేల్ సినిమాకి మేం ఖర్చు పెట్టిన బడ్జెట్, ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి మాకు ఏ పోటీ లేకుండా రావాలని ఉంది. ఏమీ అడ్డంకులు లేకుండా ఒక హైవేలో రావాలని అనుకున్నాం. పోటీ లేకుండా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చెయ్యాలి. ప్రీ రిలీజ్ లో మా సినిమానే ప్రజల దృష్టిలో ఉండాలి. ఇవన్నీ ఆలోచించుకున్నాం. మహా శివరాత్రికి ఫిబ్రవరి 28న రిలీజ్ చెయ్యొచ్చు కదా అని అంటున్నారు. నెలాఖరున పండగ వచ్చింది.. మార్చి ఫస్ట్ వీక్ నుంచి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే కూడా కలిసొస్తుందని అనుకోని, అందరం మాట్లాడుకొని ఫిబ్రవరి 7 బెస్ట్ డేట్ అని ఫిక్స్ అయ్యాం'' అని చెప్పారు.

'తండేల్' సినిమాకి అంత ఈజీగా రిలీజ్ డేట్ లాక్ చెయ్యలేదని అల్లు అరవింద్ చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది. సీనియర్ నిర్మాతగా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టే, ఈ లెక్కలన్నీ వేసుకొని విడుదల తేదీని ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే, వాలెంటైన్స్ డే ఉంది కాబట్టి రెండు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వస్తాయి. మరో సినిమా లేకుంటే అదే జోరు మూడో వారంలోనూ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాగచైతన్య కెరీర్ ను నిలబెట్టిన 'ఏమాయ చేసావే' సినిమా ఫిబ్రవరి నెలలోనే రిలీజయింది. అలానే గతంలో 'మురారి' 'మల్లీశ్వరి' 'టెంపర్' 'మిర్చి' 'ఉప్పెన' లాంటి సినిమాలు ఇదే నెలలో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. 'తండేల్' మూవీ కూడా ఈ లిస్టులో చేరుతుందేమో చూడాలి.

Tags:    

Similar News