చిరు వెర్సస్ అల్లు అరవింద్?
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటిస్తే.. అది ఫైనల్ అనుకోవడానికి అవకాశమే లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటిస్తే.. అది ఫైనల్ అనుకోవడానికి అవకాశమే లేదు. ఒకప్పుడంటే ఒక డేట్ ఇచ్చి మారిస్తే దాన్నో అపరాధంలా చూసేవారు. సినిమాను వాయిదా వేయడాన్ని నెగెటివ్ సెంటిమెంట్‌గా ఫీలయ్యేవాళ్లు. కానీ కరోనా తర్వాత మొత్తం కథ మారిపోయింది. డేట్ ఇవ్వడం.. వాయిదా వేయడం.. మళ్లీ ఇంకోసారి డేట్ మార్చడం.. ఇవన్నీ మామూలు వ్యవహారాలు అయిపోయాయి.
ఆగస్టు 15న రావాల్సిన ‘పుష్ప-2’ను డిసెంబరు 6కు వాయిదా వేయగా.. ఆ నెలకు షెడ్యూల్ అయిన వేరే సినిమాలన్నీ మరో డేట్ చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు కేవలం ‘పుష్ప-2’ మాత్రమే కారణం కాదు. కొత్తగా ‘గేమ్ చేంజర్’ మూవీని క్రిస్మస్‌కు షెడ్యూల్ చేయడంతో ఆ టైంలో రావాల్సిన రాబిన్ హుడ్, తండేల్ చిత్రాలకు డేట్ మార్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
‘రాబిన్ హుడ్’ సంగతేంటో తెలియదు కానీ.. ‘తండేల్’ టీం అయితే క్రిస్మస్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే అంటున్నారు. ఆ చిత్రాన్ని సంక్రాంతి రేసులో నిలపడం గురించి ఇప్పుడు సీరియస్‌గా ఆలోెచిస్తున్నారట. ఐతే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ రానున్న సంగతి తెలిసిందే. చిరు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన భారీ చిత్రమది. దానికి పోటీగా తన చిత్రాన్ని అల్లు అరవింద్ నిలుపుతారా అన్నది ప్రశ్న.
సంక్రాంతికే విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం రావాల్సి ఉంది. అంటే నాగచైతన్య తన మావయ్యతో తలపడాల్సి ఉంటుందన్నమాట. కానీ ఇలా బంధుత్వాలు చూసుకుంటే కష్టమని.. బిజినెస్ అంటే బిజినెస్సే అని.. పైగా చిరు, వెంకీలకు చైతూ సినిమాను పోటీగా భావించలేమని.. సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు రావడం కామనే కాబట్టి ఆ టైంలోనే తమ చిత్రాన్ని వదులుదామని అరవింద్ సీరియస్‌గానే చూస్తున్నట్లు సమాచారం. చిరు, వెంకీ సినిమాలు కాక మరేవీ రిలీజ్ కానట్లయితే ‘తండేల్’ సంక్రాంతికి రావడం దాదాపు ఖాయం అంటున్నారు.