చిరు బర్త్ డే: భార‌తీయ సినిమా లెజెండ్‌కి సెల్యూట్

కెరీర్ లో పునాది రాళ్లు(1979) చిత్రానికి తొలి సంత‌కం చేసినా ప్రాణం ఖ‌రీదు (1978) తొలి రిలీజ్. ఆ త‌ర్వాత బాపు తెర‌కెక్కించిన మ‌న ఊరి పాండ‌వులు(1978) విజ‌యం చిరుకి మేలి మ‌లుపు.

Update: 2024-08-22 03:34 GMT

భార‌తీయ సినిమా వ‌య‌సు 114 సంవ‌త్స‌రాలు. మొట్ట‌మొద‌టి భార‌తీయ సినిమా రాజా హ‌రిశ్చంద్ర చిత్రీక‌ర‌ణ‌ను 1910లో ప్రారంభించారు. ఇదే మొద‌టి ఫీచ‌ర్ ఫిలిం. ఇండియ‌న్ సినిమా అసాధార‌ణ చ‌రిత్ర‌లో 92 ఏళ్ల పాటు టాలీవుడ్ మ‌నుగ‌డ సాగించడం.. ఇంతింతై అన్న‌చందంగా నేడు అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపును ద‌క్కించుకోవ‌డం ఇదంతా ఒక చ‌రిత్ర‌. టాలీవుడ్ లో ఎంద‌రో దిగ్గ‌జ హీరోలు సినిమా స్థాయిని పెంచారు.

అయితే క‌మ‌ర్షియ‌ల్ సినిమా స్టామినాని గొప్ప ఎత్తుల‌కు చేర్చిన శిఖ‌రంగా మెగాస్టార్ చిరంజీవి ఖ్యాతి విశ్వ‌విఖ్యాత‌మైంది. తెలుగు సినిమా హిస్ట‌రీలో ఆయ‌న నాలుగు ద‌శాబ్ధాల పాటు కెరీర్ ర‌న్ ని విజ‌య‌వంతంగా కొన‌సాగించారు. 69 వ‌య‌సులోను చిరు ఇంకా న‌వ‌యువ‌కుడిలా అలుపెర‌గకుండా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు.

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో 46ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ని కొన‌సాగించిన చిరు ప్ర‌స్థానాన్ని ఓ మారు త‌ర‌చి చూస్తే ఎన్నో అసాధార‌ణ విజ‌యాలు.. స్ఫూర్తిని నింపే ప్ర‌య‌త్నాలు క‌నిపిస్తాయి. టాలీవుడ్‌ను క‌మ‌ర్షియ‌ల్ కోణంలో పెద్ద ఎత్తుకు చేర్చిన‌ ఘ‌న‌త మెగాస్టార్ చిరంజీవికి ద‌క్కుతుంది. త‌న కాలంలో వ‌యో లింగ భేధం లేకుండా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్ని అల‌రించిన మేటి క‌థానాయ‌కుడు చిరు.

చిన్న పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కూ ప్ర‌తి ఇంట్లో ప్ర‌తి ఒక్క‌రూ చిరంజీవిని త‌మ‌వాడిగా భావించారు. ఆయ‌న న‌టించిన సినిమా చూడ‌డం ఒక‌ అవ‌స‌రంలా భావిస్తారు. అందుకే తెలుగు సినిమా వాణిజ్యానికి కేంద్ర బిందువు అయ్యారు. హిస్ట‌రీని మ‌లుపు తిప్పిన గొప్ప క‌థానాయ‌కుడిగా కీర్తినందుకున్నారు చిరంజీవి.

కెరీర్ లో పునాది రాళ్లు(1979) చిత్రానికి తొలి సంత‌కం చేసినా ప్రాణం ఖ‌రీదు (1978) తొలి రిలీజ్. ఆ త‌ర్వాత బాపు తెర‌కెక్కించిన మ‌న ఊరి పాండ‌వులు(1978) విజ‌యం చిరుకి మేలి మ‌లుపు. చిత్ర‌ప‌రిశ్ర‌మ త‌న ప్ర‌తిభ‌ను ఎలా ఉప‌యోగించుకోవాలో అలా వినియోగించుకుంటుంద‌ని అప్ప‌టికి యువ‌కుడైన‌ చిరంజీవి న‌మ్మ‌కం. అందుకే ప్ర‌తినాయ‌క పాత్ర‌లు చేయ‌డానికి సైతం కెరీర్ ఆరంభంలో వెన‌కాడ‌లేదు.

తొలుత త‌న సీనియ‌ర్లు అయిన‌ ఎన్టీ రామారావుతో 'తిరుగులేని మ‌నిషి', కృష్ణ తో క‌లిసి 'కొత్త పేట రౌడీ', శోభ‌న్ బాబుతో 'మోస‌గాడు' వంటి చిత్రాల్లో విల‌న్ పాత్ర‌ల్లో న‌టించారు..1980లో నెగెటివ్ షేడ్ ఉన్న హీరో పాత్ర 'పున్న‌మి నాగు' చిరుకి ఆరంభంలోనే గొప్ప మ‌లుపు. త‌న‌లో న‌టుడిని చాలా ఎత్తున ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. అప్ప‌ట్లో ఇది చిరుకు యువ‌త‌లో ప్ర‌త్యేక‌మైన‌ క్రేజును పెంచింది. న‌టుడిగా వ్య‌క్తిగ‌తంగానూ 1980 ఆయ‌న‌కు మ‌ర‌పురాని సంవ‌త్స‌రంగా మారింది.

ఇదే ఏడాది సుప్ర‌సిద్ధ నిర్మాత‌ అల్లు రామ‌లింగ‌య్య గారి కుమార్తె సురేఖ‌ను చిరంజీవి పెళ్లాడారు. ప్ర‌ముఖ నిర్మాత‌కు అల్లుడుగా చిరు క్రేజ్ మ‌రింత పెరిగింది. 1982లో ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య .. శుభ‌లేఖ చిత్రాలు మోడ్ర‌న్ హీరోగా గుర్తింపును తెచ్చి పెట్టాయి. చిరంజీవి రాక‌తో తెలుగు సినిమా మౌలిక ల‌క్ష‌ణాలు మారిపోయాయి. అంత‌వ‌ర‌కూ ధీరోదాత్త‌త ఉన్న హీరో పాత్ర‌ల స్థానే హీరోదాత్త‌త ప్ర‌స్పుటంగా క‌నిపించే పాత్ర‌లు చోటు చేసుకోవ‌డం ప్రారంభించాయి. 1982లో విడుద‌లైన 'ఖైదీ' చిత్రం తెలుగు సినిమా రూపురేఖ‌ల్ని స‌మూలంగా మార్చివేసింది.

చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ఖైదీ మాస్ లో అసాధార‌ణ ఫాలోయింగ్ ని తెచ్చింది. చిరు కెరీర్ కీల‌క మ‌లుపు ఇది. ఎ.కోదండ రామిరెడ్డి దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఖైదీ చిరంజీవిలోని అభిన‌యం ప్రావీణ్య‌త ఆయ‌న‌ను స్టార్ డ‌మ్‌ని ఎంత‌గానో ప్ర‌మోట్ చేయ‌డ‌మే గాకుండా తెలుగు సినిమా గ‌మ‌నాన్నే ఈ చిత్రం మార్చివేసింది. ఈ చిత్రంతో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఎదురేలేని హీరోగా స్థిర‌ప‌డ్డారు చిరంజీవి.

మ‌గ‌మ‌హారాజు-అభిలాష‌-విజేత‌-మ‌గ‌ధీరుడు వంటి చిత్రాలు కుటుంబ క‌థ‌ల‌తో తెర‌కెక్కి ఫ్యామిలీ ప్రేక్ష‌కుల్ని అభిమానులుగా మారిస్తే.. మంత్రిగారి వియ్యంకుడు-ఛాలెంజ్ - సంఘ‌ర్ష‌ణ వంటి చిత్రాలు యువ‌త‌ను చేరువ చేసాయి. రాక్ష‌సుడు క‌మ‌ర్షియ‌ల్ గా ప‌రిధిని పెంచితే ఆరాధ‌న న‌టుడిగా ఆయ‌న‌లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది. 80వ ద‌శ‌కం ఆరంభంలో అద్భుత‌ విజ‌యాలతో కెరీర్ ని సుసంప‌న్నం చేసుకుంటూ మాస్ ప్రేక్ష‌కుల్లో తిరుగులేని మ‌హ‌త్త‌ర శ‌క్తిగా ఎదిగారు చిరంజీవి. దాదాపు మూడు ద‌శాబ్ధాలు ఆ ప్ర‌భంజ‌నం అదే వ‌రుస కొన‌సాగింది.

ఎన్టీ రామారావు, కృష్ణ‌ త‌ర్వాత‌ మాస్ లో అంత‌టి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా చిరంజీవి ఎదిగారు. ప్ర‌తి సినిమాలో వైవిధ్యం కోసం చిరు త‌పించేవారు. న‌ట‌న‌లో, డ్యాన్సుల్లో ప‌రిణ‌తిని వైరుధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చిన చిరంజీవి తెలుగు సినిమా వాణిజ్య విస్త్ర‌తిని అమాంతం పెంచారు. చిరంజీవి న‌టించిన ప్ర‌తి సినిమా ట్రేడ్ ప‌రంగా విప‌రీత‌మైన సంచ‌ల‌నాలను సృష్టించాయి. ప‌రిశ్ర‌మ వ్యాపార వ‌ర్గాలు విస్తుపోయి విస్మ‌యం పొందే రీతిలో చిరంజీవి సినిమాల‌ బిజినెస్ సాగింది. అంత‌వ‌ర‌కూ సినిమా ప‌రిశ్ర‌మ ఎరుగ‌ని వాణిజ్య‌పు లెక్క‌లు చిరంజీవి సినిమాల‌తోనే చ‌రిత్ర‌లో వెలుగు చూశాయి.

నేటి తెలుగు సినిమా వ్యాపారానికి స‌మూల‌మైన మార్పులు తీసుకొచ్చి సువ‌ర్ణ‌మ‌య‌పు దారులు వేసిన‌ తొలి తెలుగు క‌థానాయ‌కుడు చిరంజీవి అంటే అతిశ‌యోక్తి కాదు అని ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు విశ్లేషించారు. మూస‌ధోర‌ణిలో డ్యాన్సులు చేసే ప‌ద్ధ‌తుల‌కు స్వ‌స్థి చెప్పి పాశ్చాత్య నృత్య రీతుల‌ను చేయ‌డం నేర్పింది చిరంజీవి.

ప‌సివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డ్యాన్సులు ప్ర‌వేశ‌పెట్టి నృత్యాల్ని కొత్త పోక‌డ ప‌ట్టించిన హీరో చిరంజీవి. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో కొండ‌వీటి దొంగ‌- జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి- ఘ‌రానా మొగుడు వంటి క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నాలు న‌మోదు చేశారు. కె.విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో శుభ‌లేఖ కుటుంబ ఆడియెన్ ని చేరువ చేసింది.

అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ 'రుద్ర‌వీణ' జాతీయ ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా సంచ‌ల‌నం సృష్టించింది. 1990లో వ‌ర‌ద‌ల్లో 'జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి' చిరు కెరీర్ లో మ‌రో కీల‌క మ‌లుపు. ఆ త‌ర్వాత‌ 'ఘ‌రానా మొగుడు' చిరంజీవి మాస్ ఇమేజ్ ని స్కైలోకి తీసుకెళ్లింది. మ‌ధ్య‌లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా హిట్ల‌ర్- మాస్ట‌ర్ - బావ‌గారు బాగున్నారా- ఇద్ద‌రు మిత్రులు- అన్న‌య్య లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఇంద్ర - ఠాగూర్ - స్టాలిన్ లాంటి సంచ‌ల‌న చిత్రాలు తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌న్న‌న‌లు అందుకున్నాయి. సైరా న‌ర‌సింహారెడ్డి తో పాన్ ఇండియా స్టార్ గా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకున్నారు. సైరా చిత్రానికి హిందీ క్రిటిక్స్ నుంచి గొప్ప ప్ర‌శంస‌లు కురిసాయి.

ఇటీవ‌ల గాడ్ ఫాద‌ర్ చిత్రంలో త‌న న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. అలాగే వాల్తేరు వీర‌య్య చిత్రంతో మ‌రోసారి త‌న‌లోని మాస్ ని బ‌య‌ట‌కు తీసి గ్రాండ్ స‌క్సెస్ అందుకున్నారు. ఇప్పుడు వీట‌న్నిటి కంటే విభిన్న‌మైన ఫాంట‌సీ క‌థాంశంతో విశ్వంభ‌ర తెర‌కెక్కుతోంది. ఈ సినిమా పోస్ట‌ర్లు ఇప్ప‌టికే ఫ్యాన్స్ ప్ర‌జ‌ల్లో గొప్ప క్రేజ్ ని పెంచాయి. 2025 సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది.

ప్ర‌జాసేవ‌లోను ఒక చ‌రిత్ర‌:

స్టార్ హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి ప్ర‌జాసేవ‌లోను శిఖ‌రం ఎత్తు అని నిరూపించారు. 1998 అక్టోబ‌ర్ లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ స్తాపించి ఐ అండ్ బ్ల‌డ్ బ్యాంకుల‌తో సేవ‌లు ప్రారంభించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న త‌న‌ అభిమానులను ఇందులో భాగం చేశారు. త‌లసేమియా అనే ప్ర‌మాద‌క‌ర రుగ్మ‌త ఉన్న వారిని ఆదుకునేందుకు చిరు త‌న‌వంతు కృషి చేస్తున్నారు.

అవార్డులు రివార్డులు:

స్వ‌యం కృషి- ఆప‌ద్భాంద‌వుడు వంటి సినిమాలు చిరంజీవిలోని న‌టుడిని మ‌రో కోణంలో ప‌రిచ‌యం చేసాయి. కెరీర్ లో నంది అవార్డులు, జాతీయ అవార్డుల‌ను అందుకున్నారు. ఫిలింఫేర్‌లు, ఇత‌ర ప్ర‌యివేట్ పుర‌స్కారాల‌కు అయితే కొద‌వే లేదు. ఒక న‌టుడిగానే కాకుండా ఒక మ‌నిషిగా ఆయ‌న చేసిన సేవ‌ల్ని ప్ర‌భుత్వాలు గుర్తించాయి. చాలా కాలం త‌ర్వాత‌ కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌విభూష‌ణ్ బిరుదుల‌తోను స‌త్క‌రించింది. త‌న సీనియ‌ర్ న‌టుల విష‌యంలో ఎప్ప‌టికీ విధేయ‌త‌తో ఉండే మెగాస్టార్ చిరంజీవి.. న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌమ సీనియ‌ర్ ఎన్టీఆర్ కి 'భార‌త‌ర‌త్న' ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

చాలామందిలా మెగాస్టార్ ఓవ‌ర్‌నైట్ స్టార్ కాదు. ప‌డుతూ లేస్తూ ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటూ అజేయంగా ఎదిగిన స్ఫూర్తి ప్ర‌ధాత‌. నేడు 157 సినిమాల్లో న‌టించిన అజేయ‌మైన స్టార్ మ‌న మెగాస్టార్. వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ డ‌బుల్ సెంచ‌రీ వైపు అడుగులు వేస్తూ చ‌రిత్ర సృష్టించ‌బోతున్నారు. నేడు మెగా బ‌ర్త్ డే బోయ్‌కి 'తుపాకి' త‌ర‌పున ప్ర‌త్యేక‌ శుభాకాంక్ష‌లు.

- శివ రామ కృష్ణ

Tags:    

Similar News