షోయబ్‌తో ఎఫైర్ వార్తలకు ఆందోళన చెందానన్న నటి
భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇప్పుడు తన భర్త షోయబ్ మాలిక్ నుండి చట్టబద్ధంగా విడిపోయింది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- షోయబ్ మాలిక్ జంట విడాకుల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో పాకిస్తాన్ క్రేజీ నటి ఆయేషా ఒమర్ షోయబ్ మాలిక్ తో ముడిపడిన ఒక పీడకలను ఇప్పుడు గుర్తుచేసుకుంది. తనపై నిరాధారమైన ఊహాగానాల కారణంగా తీవ్ర భయాందోళనలకు గురయ్యానని సదరు నటి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇప్పుడు తన భర్త షోయబ్ మాలిక్ నుండి చట్టబద్ధంగా విడిపోయింది. ఇటీవల షోయబ్ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. సానియా మీర్జాను వివాహం చేసుకున్న సమయంలో షోయబ్ పలువురితో ఎఫైర్లు నడిపించాడని ఆరోపణలు వచ్చాయి. వారి విడిపోవడం గురించి సోషల్ మీడియాలో పుకార్లు వచ్చినప్పుడు, షోయబ్ పాకిస్థానీ నటి అయేషా ఒమర్‌తో సంబంధం కలిగి ఉన్నారని చాలా మంది భావించారు. ఈ పుకార్లు తనను ఎంతగా ప్రభావితం చేశాయో, ఎవరైనా వాటి గురించి మాట్లాడినప్పుడల్లా తీవ్ర భయాందోళనలకు గురయ్యానని ఆయేషా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అయేషా ఒమర్‌ను ఇటీవల ఇఫ్ఫత్ ఉమర్ ఇంటర్వ్యూ చేశారు. సంభాషణల సమయంలో, ఇఫ్ఫత్ ఆయేషాను మాజీ పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో లింక్ చేసి ప్రజలు మాట్లాడుకుంటున్న సమయం గురించి అడిగాడు. ఈ దశ మొత్తం తనకు పీడకల లాంటిదని ఆయేషా పేర్కొంది. ప్రజలు తనను షోయబ్‌తో లింక్ చేయడమే కాకుండా అతనితో పెళ్లి కూడా చేశారని ఆమె చెప్పింది. షోయబ్ మాలిక్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తన బంధువులు కూడా నమ్మే విధంగా పరిస్థితి చేయిదాటిపోయిందని సదరు నటీమణి గుర్తు చేసుకున్నారు. తనకు షోయబ్‌కి సంబంధించిన ఏవైనా పుకార్లు వినడం లేదా చదివినప్పుడల్లా తనకు తీవ్ర భయాందోళనలు కలిగేవని అయేషా తెలిపింది.
ఒక పాపులర్ కమర్షియల్ ప్రకటన కోసం వీరిద్దరిపైనా ఒక బోల్డ్ ఫోటోషూట్ చిత్రీకరించినప్పుడు.. షోయబ్ మాలిక్‌తో అయేషా ఒమర్ డేటింగ్ గురించి పుకార్లు వినిపించాయి. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా టెంప్టింగ్గా అనిపించింది. షోయబ్ ఆయేషాతో రిలేషన్షిప్లో ఉండటం ద్వారా సానియా మీర్జాను మోసం చేస్తున్నాడని ప్రజలు భావించారు. అయితే ప్రొఫెషనల్ కమిట్మెంట్ లు తప్ప షోయబ్‌తో ఎలాంటి అనుబంధాన్ని కలిగిలేనని చెబుతూ అయేషా ఆ ప్రచారాన్ని ఖండించింది.