టైగర్ తో ఏపీ డిప్యూటీ సీఎం ఫైటింగ్...!
ఆ మూడు సినిమాలను పూర్తి చేసే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడని సమాచారం అందుతోంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు ఎప్పుడు ఎప్పుడు వస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్స్ మధ్య లో ఉన్నాయి. ఆ మూడు సినిమాలను పూర్తి చేసే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడని సమాచారం అందుతోంది.
రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా దాదాపు ఆరు ఏడు నెలలుగా షూటింగ్ లకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత అంటే జూలైలో సినిమా షూటింగ్స్ కు హాజరు అవుతాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు ఉండటం వల్ల ఆయన ఎప్పుడు షూటింగ్ కి హాజరు అయ్యేది తెలియడం లేదు.
పవన్ అభిమానులతో పాటు అందరి దృష్టి ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాపై ఉంది. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభం అయిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల చేతులు మారిన విషయం తెల్సిందే. నిర్మాత ఏ ఎం రత్నం తాజాగా హరి హర వీరమల్లు సినిమా విశేషాలను మీడియా తో పంచుకున్నాడు.
సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా ఉండబోతున్నాయి అన్నాడు. ఇరాన్ కి చెందిన ప్రముఖ కంపెనీ తో మచిలీపట్నం ఓడరేవు లో తీసిన సన్నివేశాలకు సీజీ చేయిస్తున్నాం. ఇక కుస్తీ ఎపిసోడ్ కి సంబంధించిన సన్నివేశాలకు బెంగళూరు లో సీజీ వర్క్ జరుగుతుంది.
సినిమాలో అత్యంత కీలకమైన చార్మినార్ ఎపిసోడ్స్ కి సంబంధించిన సీజీ వర్క్ కూడా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరో పవన్ మరియు టైగర్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాలకు సంబంధించిన సీజీ వర్క్ ను కూడా నిర్వహిస్తున్నాం అన్నారు.
హరి హర వీరమల్లు సినిమా ను రెండు పార్ట్ లుగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. మొదటి పార్ట్ ను 2024 లో విడుదల చేయాలని నిర్మాత పట్టుదలతో ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చేనా అనేది చూడాలి.