కల్కి గన్నుల ప్రపంచం.. ఇక ఊచకోత పక్కా
ఈ సినిమా గ్లింప్స్ ఇది వరకే రిలీజ్ అయినప్పటికీ, దీంతో సమానంగా మేకింగ్ వీడియోలు కూడా ఆకర్షిస్తున్నాయి.;
'ఫ్రమ్ ది స్క్రాచ్' అంటూ కల్కి మూవీ యూనిట్ నుంచి వస్తున్న వీడియోలు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్ ఇది వరకే రిలీజ్ అయినప్పటికీ, దీంతో సమానంగా మేకింగ్ వీడియోలు కూడా ఆకర్షిస్తున్నాయి. ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా స్క్రాచ్ ఎపిసోడ్ 3: గన్స్ రీ-ఇమాజినింగ్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో గన్స్ ఎలా రూపొందించారో చూపించారు మేకర్స్.
గన్నుల కోసం ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఎంతలా కష్టపడిందో ఈ వీడియోలో చూపించారు. 1.37 సెకన్లు ఉన్న ఈ వీడియో మొదటి నుంచి చివర వరకు ఫన్నీగా సాగింది. ఇంతకీ గన్ను పేలుతుందా, లేదా అంటూ సెటైర్లు కూడా వేసుకున్నారు. ఓ వార్ ఎపిసోడ్ కు నాగ్ అశ్విన్ అండ్ కో రెడీ అయినట్లు తెలుస్తోంది. గన్స్ మాత్రం హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తీసిపోనివిగా ఉన్నాయి. నిజానికి ఈ వీడియోను.. నిన్ననే ఐఐటీ బాంబేలో ప్రీమియర్ గా స్టూడెంట్స్ కోసం ప్రదర్శించేశారు.
ఈ వీడియోను చూశాక.. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది దర్శకులు రాజమౌళినే ఫాలో అవుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆయన సినిమాల్లో ఏదో ఒక ఆయుధం హీరోగా చేతికి వచ్చాక సినిమా కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఇటీవలే ఖైదీ, విక్రమ్, యానిమల్ సినిమాల్లో భారీ మిషన్ గన్లను చూశామని.. ఇప్పుడు కల్కి కోసం నాగ్ అశ్విన్ ఏకంగా గన్నుల ఫ్యాక్టరీనే తెరిచేశాడని అంటున్నారు.
టైమ్ మిషన్ లోకి వెళ్లి మరీ భవిష్యత్తును ఈ సినిమా ద్వారా ఆవిష్కరించబోతున్నారు నాగ్ అశ్విన్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొణె, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.