టైర్ 2 హీరోల 100 కోట్ల హడావుడి
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రూ.100 బిజినెస్ అంటే పెద్ద గొప్ప. ఇది ప్రతి హీరోకు సాధ్యమయ్యేది కాదు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రూ.100 బిజినెస్ అంటే పెద్ద గొప్ప. ఇది ప్రతి హీరోకు సాధ్యమయ్యేది కాదు. కేవలం ఒకరిద్దరు స్టార్ హీరోలకు మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడంతా పరిస్థితి మారిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ వచ్చాక.. టైర్ 2 హీరోలు కూడా తమ చిత్రాలతో రూ.100 కోట్ల బిజినెస్ ఈజీగా చేసేస్తున్నారు. అందుకు కారణం ఇప్పుడు ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్నాయి. పలు భాషల్లో డబ్బింగ్ అవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నారు. అందుకే ఇప్పుడీ చిత్రాల ఓవరాల్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా నాన్ థియేట్రికల్ రైట్స్ అయితే భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి.
రీసెంట్గా విజయ్ దేవరకొండ-సమంత ఖుషి బిజినెస్ కూడా భారీ మొత్తంలోనే జరిగింది. లైగర్-శాకుంతలం వంటి చిత్రాలతో ఫ్లాప్‌లు అందుకున్నప్పటికీ ఈ చిత్ర బిజినెస్ దాదాపు రూ.100 కోట్లకు చేరువగా అయిందట. ఈ చిత్రం కూడా దాదాపు అన్ని భాషల్లో రిలీజైంది. అలాగే హిట్ టాక్ కూడా అందుకుంది. ఇక నాని విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఆయన సినిమాలు కూడా ఇతర భాషల్లో చెప్పుకోదగ్గ వసూళ్లను అందుకుంటున్నాయి. అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా మంచి ధరకే అమ్ముడుపోతున్నాయి. రీసెంట్గా దసరాతో ఆయన మార్కెట్ మరింత పెరిగింది. దీంతో ఆయన కొత్త సినిమా హాయ్ నాన్న నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచిగా జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.100కోట్లు వచ్చే అవకాశముందని అంటున్నారు.
రామ్పోతినేని స్కంద కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం బిజినెస్ దాదాపు రూ.150కోట్లు అయిందని అంటున్నారు. హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి ఈ మొత్తం అందుకుందని టాక్ వినిపిస్తోంది. ఇక రామ్ నటిస్తున్న మరో చిత్రం డబుల్ ఇస్మార్ట్ కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. దీనికి కూడా భారీ మొత్తంలోనే బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇక పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానున్న రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా రూ.100కోట్ల వరకు వ్యాపారాన్ని చేసుకుందని తెలిసింది. నాగచైతన్య చందు మొందేటి పాన్ ఇండియా ఫిల్మ్ కూడా రూ.100కోట్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా మార్కెట్ సంపాదించుకున్న నిఖిల్ కొత్త చిత్రాలు భారీ బిజినెస్‌లు చేస్తున్నాయని తెలుస్తోంది.