కాంతార ప్రీక్వెల్ కోసం జక్కన్నమెచ్చిన టెక్నీషియన్
టోడర్ లాజరోవ్ ను 'కాంతార' సినిమా కోసం తీసుకురావడం ద్వారా అంచనాలు భారీగా పెంచడం జరిగింది.
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన 'కాంతార' 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చిన్న సినిమాగా రూపొందిన కాంతార పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కాంతార సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. దాంతో కాంతార ప్రాంచైజీ నుంచి మరో సినిమాను తీసుకు రావాలని రిషబ్ శెట్టి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కాంతార 2 ను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. అయితే కాంతార కథకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్‌గా కాంతార 2 ఉండబోతుంది. 'కాంతార : చాప్టర్ 1' టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రిషబ్ శెట్టి అంచనాలు భారీగా పెంచుతూ వస్తున్నారు.
కాంతార సినిమాను కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన రిషబ్ శెట్టి ప్రీక్వెల్‌ను మాత్రం దాదాపుగా రూ.150 కోట్లతో రూపొందిస్తున్నాడు. సినిమా పూర్తి అయ్యే సమయంకు ఈ బడ్జెట్ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కాంతార : చాప్టర్ 1' స్థాయి మరింత పెరిగే వార్తను రిషబ్ శెట్టి షేర్ చేశాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అత్యంత కీలకం. కనుక ఆ సన్నివేశాల కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్ ను రంగంలోకి దించినట్లు అధికారికంగా ప్రకటించారు.
బల్గేరియాకు చెందిన ఈ యాక్షన్ కొరియోగ్రాఫర్ టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా కోసం వర్క్ చేశారు. ఆ సమయంలో రాజమౌళి ప్రశంసలు సైతం దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. రాజమౌళి వద్ద మంచి పేరు సొంతం చేసుకోవడంతో పాటు, ఆర్ఆర్‌ఆర్ సినిమా యాక్షన్ సన్నివేశాలకు మంచి మార్కులు పడేలా చేసిన టోడర్ లాజరోవ్ ను 'కాంతార' సినిమా కోసం తీసుకురావడం ద్వారా అంచనాలు భారీగా పెంచడం జరిగింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు టాప్ నాచ్ ఉంటాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఇప్పటికే కాంతార : చాప్టర్ 1 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎంపికతో అంచనాలు మరింత పెరగడం ఖాయం.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ పలువురు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్ సైతం ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్న నేపథ్యంలో కచ్చితంగా సినిమా పాన్ ఇండియా రేంజ్ ను మించి ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. అలాంటిది కాంతార 2 ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. పైగా రిషబ్ శెట్టి ఈసారి అంతకు మించి అన్నట్లుగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నారు. కనుక వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ గా కాంతార : చాప్టర్ 1 నిలుస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.